దళితబంధు ఆపడం చట్టవిరుద్ధం 

22 Oct, 2021 03:45 IST|Sakshi

హైకోర్టులో పిల్‌ దాఖలు   

సాక్షి, హైదరాబాద్‌: దళితబంధు పథకాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 18న జారీచేసిన ఉత్తర్వులను చట్టవిరుద్ధంగా ప్రకటించాలంటూ సామాజిక కార్యకర్త మల్లేపల్లి లక్ష్మయ్య హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు గురువారం ఆయన ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేశారు. ‘దళితుల అభ్యున్నతి కోసం దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ముందుగా వాసాలమర్రిలో దళితులకు రూ.7.60 కోట్లను గత ఆగస్టు 5న విడుదల చేశారు. అలాగే పైలెట్‌ ప్రాజెక్టుగా కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌లో ఆగస్టు 16 నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు.

దళితబంధు ఇప్పటికే కొనసాగుతున్న పథకం. హుజూరాబాద్‌ ఎన్నికలతో సంబంధం లేకపోయినా, ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం కాకపోయినా.. ఎన్నికల కమిషన్‌ ఈ పథకం అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీచేసింది. దళితబంధు పథకాన్ని ఆపాలని ఆదేశించడం దళితుల హక్కులను హరించడమే.

పథకం నిలిపివేతపై కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయండి’ అని పిటిషనర్‌ కోరారు. ఈ పిటిషన్‌లో కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ఎన్నికల అధికారి, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి, రాష్ట్ర ఎస్సీ కోఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ వీసీ, ఎండీని ప్రతివాదులుగా చేర్చారు.  

మరిన్ని వార్తలు