దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేదు 

22 Jan, 2023 02:13 IST|Sakshi
విలేకరులతో మాట్లాడుతున్న నృత్యకారిణి మల్లికా సారాభాయ్‌. చిత్రంలో బీవీ పాపారావు  

రామప్ప వద్ద ప్రదర్శనకు అనుమతివ్వకపోవడం బాధాకరం 

ప్రముఖ నృత్యకారిణి మల్లికా సారాభాయి 

హనుమకొండ: ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన రామప్ప ఆలయ సన్నిధిలో రామప్ప ఉత్సవాల నిర్వహణకు కేంద్రం అనుమతివ్వకపోవడం బాధాకరమని ప్రముఖ నృత్యకారిణి, పద్మభూషణ్‌ అవార్డు గ్రహీత మల్లికా సారాభాయి అన్నారు. శనివారం హనుమకొండలో కాకతీయ హెరిటేజ్‌ ట్రస్టు సభ్యుడు బీవీ పాపారావుతో కలసి ఆమె విలేకరులతో మాట్లాడారు. శివుడికి ప్రీతిపాత్రమైన అభినయాన్ని శక్తి స్థలమైన రామప్పలో చేయాలని నిర్ణయించుకున్నానని, కానీ దీనికి కేంద్ర ప్రభుత్వం అనుమతించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భావ వైరుధ్యాలను కళలకు ఆపాదించడం సమంజసం కాదన్నారు.

రాజకీయంగా అభద్రత ఉన్న వారి కారణంగా దేశంలో ప్రశ్నించే పరిస్థితి లేకుండా పోయింద­న్నా­రు. అయితే భారత్‌ ప్రజాస్వామ్య దేశమని, ప్రశ్నించడం సగటు భారతీయుడి డీఎన్‌ఏలోనే ఉన్నదని పేర్కొన్నారు.  వేదాల్లోంచే ఇది వచ్చిందన్నారు. అందుకే ప్రశ్నలు కొనసాగుతుంటాయని, తాను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. రామప్ప­కు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత మొదటి­సారి ఇక్కడ నృత్య ప్రదర్శన చేయాలని అనుకున్నానన్నారు.

రామప్ప ఆలయం ఆవరణలో ప్రదర్శన రద్దయినా, వెంటనే హనుమకొండలో ప్రదర్శనను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. గుజరాత్‌లో 2002లో జరిగిన అల్లర్లను తాను వ్యతిరేకించానని, బాధ్యత కలిగిన పౌరురాలిగా గుజరాత్‌ అల్లర్లకు అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మో­దీ, పోలీసులు, ప్రభుత్వందే బాధ్యత అని చె­ప్పడంతోపాటు సుప్రీంకోర్టుకు వెళ్లానని పేర్కొన్నా­రు. అప్పటినుంచి ఇప్పటి పాలకులతో విభేదిస్తూ­నే ఉన్నానని, అదే కొనసాగుతుందని అన్నారు.  

మరిన్ని వార్తలు