బ్రిటిష్, నిజాంలను మరిపిస్తున్న కేసీఆర్‌

14 Aug, 2021 01:57 IST|Sakshi
ఎల్లన్ననగర్‌లో సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే సీతక్కకు సమస్యను వివరిస్తున్న మహిళ  

సీఎల్పీ నేత భట్టి, ఎమ్మెల్యే సీతక్క ధ్వజం

కొత్త పోడు కొట్టం, పాతది పోనివ్వం.. అంటూ పోడురైతులకు అండ 

జైలుకెళ్లి వచ్చిన మహిళలను పరామర్శించిన నేతలు

కొణిజర్ల: గత ముప్ఫై ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న గిరిజనులు, నిరుపేదలపై కేసీఆర్‌ ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ జైలుపాలు చేయడం బ్రిటిష్, నిజాంల పాలనను తలపిస్తోందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ములుగు ఎమ్మెల్యే సీతక్క విమర్శించారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్‌లో ఇటీవల పోడు ఘర్షణలో అటవీ అధికారులు కేసులు నమోదు చేయగా, జైలుకు వెళ్లి వచ్చిన మహిళారైతులను వారు శుక్రవారం ఇక్కడ పరామర్శించారు.

ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ...  దశాబ్దాలుగా పోడు భూములు సాగు చేసుకుంటున్నవారికి తమ హయాంలో హక్కు కల్పించగా, 2014 తర్వాత ఆ చట్టం అమలు కావడం లేదన్నారు. దీనికితోడు నిరుపేద దళితులు, గిరిజనులకు మూడెకరాలు భూమి ఇస్తానని గద్దెనెక్కిన కేసీఆర్‌ తర్వాత ఆ భూమి ఇవ్వకపోగా, ఉన్న పోడు భూములను లాగేసుకుంటున్నారని మండిపడ్డారు. ఎల్లన్ననగర్‌ పోడు సాగుదారుల విషయంలో అటవీ, జైలు శాఖల అధికారుల తీరు సభ్యసమాజం తలదించుకునేలా ఉందన్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు నిరుపేదలంటే చిన్నచూపని ఆరోపించారు. బడా భూస్వాములు గుట్టలకు పట్టాలు చేయించుకున్నా రైతుబంధు ఇస్తూ, పేదలు పోడు సాగుచేసుకుంటే మాత్రం ఒప్పుకోవడం లేదని విమర్శించారు.  ఇక్కడి మహిళలపై అట వీ అధికారులు తప్పుడు కేసులు పెట్టి జైలుకు పం పితే, జైలు అధికారులు ఇబ్బంది పెట్టడం క్షమించరాని నేరమని పేర్కొన్నారు. ‘కొత్త భూమి కొట్టం, పాత భూమి పోనివ్వం’అనే నినాదంతో కాంగ్రెస్‌ పార్టీ ఉద్యమిస్తుందని సీతక్క వెల్లడించారు. వారి వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య  పాల్గొన్నారు.  

గిరిజనులిచ్చిన రొట్టెలు  తిన్న భట్టి, సీతక్క 
ఎల్లన్ననగర్‌ పోడు సాగుదారులను పరామర్శించడానికి వచ్చిన భట్టి విక్రమార్క, సీతక్కకు వారు జొన్నరొట్టెలు ఇచ్చారు. స్థానిక గిరిజన మహిళలు రొట్టెలు తినాలని కోరగా, తొలుత వద్దని చెప్పిన నేతలు ఆ తర్వాత పప్పుతో జొన్న రొట్టెలు తినడంతో స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు