రాజీవ్‌ మార్గంలో వెళ్లడమే ఆయనకు ఘన నివాళి 

22 May, 2022 00:53 IST|Sakshi

సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క  

సాక్షి, హైదరాబాద్‌: మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ చూపిన మార్గంలో వెళ్లడమే ఆయనకు అర్పించే ఘనమైన నివాళి అని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రాజీవ్‌గాంధీ 31వ వర్ధంతి సందర్భంగా శనివారం గాంధీభవన్‌లో ఆయన చిత్రపటానికి మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌లతో కలసి భట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అవినీతి మరక లేకుండా దేశంలో శాస్త్ర, సాంకేతిక రంగాలను పరుగులు పెట్టించిన ఘనత రాజీవ్‌ గాంధీకే దక్కుతుందన్నారు. ప్రపంచంలోని గొప్ప సంస్థలకు దేశానికి చెందిన వారు సీఈవోలుగా ఉన్నారంటే అందుకు రాజీవ్‌ అమల్లోకి తెచ్చిన విధానాలే కారణమన్నారు. 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించి, ఇంటింటికి తాగునీటి సౌకర్యం కల్పించారని, ఆయన హయాంలోనే దేశంలో సెల్‌ఫోన్‌లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. జాతి సమైక్యత కోసం నాడు దేశవ్యాప్తంగా సద్భావన యాత్ర చేసిన ఘనత రాజీవ్‌ గాంధీదేనని, ఆయన బాటలోనే ఇప్పుడు రాహుల్‌ గాంధీ భారత్‌ జోడో యాత్ర చేపడుతున్నారని అన్నారు.

కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనపై స్పందిస్తూ రాష్ట్రాల పర్యటన సీఎం వ్యక్తిగతమని, ఆయన ఎక్కడ పర్యటించినా రాష్ట్రంలోని రైతాంగం పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలు, రుణమాఫీతో పాటు ఇతర రైతాంగ సమస్యలకు పరిష్కారం చూపి ఆయన దేశంలో పర్యటిస్తే బాగుంటుందని వ్యాఖ్యానించారు. కేంద్రం నేరుగా గ్రామపంచాయతీలకు నిధులివ్వడంలో తప్పులేదని భట్టి అభిప్రాయపడ్డారు.    

మరిన్ని వార్తలు