సామాన్యులు ఎవరూ బతికే పరిస్థితి లేదు: భట్టి

21 Jun, 2021 18:29 IST|Sakshi

ఖమ్మం:  మ‌ధిర నియోజ‌క‌వ‌ర్గం చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడానికి చెందిన మ‌రియ‌మ్మ‌, ఆమె కుమారుడు ఉద‌య్ కిర‌ణ్‌ను  భువ‌న‌గిరి జిల్లా అడ్డ‌గూడూరుకు చెందిన పోలీసులు ఈ నెల 16న వారిని పిక‌ప్ చేసుకునివెళ్లి.. అడ్డ‌గూడూరు స్టేష‌న్ లో గొడ్డునుబాదిన‌ట్టు బాద‌డం అత్యంత బాధాక‌రమని సిఎల్పీ నేత భట్టి విక్రమార్క మల్లు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు రోజులపాటు కొట్టిన చోట కొట్టకుండా కొట్టడం మరింత బాధాకరమన్నారు.  ఈనెల 17న మ‌ళ్లీ మ‌రియ‌మ్మ‌ను చింత‌కాని మండ‌లం కోమ‌ట్లగూడెం తీసుకువ‌చ్చి గ్రామ‌స్థులంతా చూస్తుండ‌గా.. చింతకానీ పోలీస్ స్టేషన్ లో వదిలేస్తామని చెప్పి, చింతకానీ కాకుండా కొనిజర్ల తీసుకువెళ్లి కుమార్తె ముందే మరియమ్మును శారీరకంగా హింసించడం దారుణమన్నారు.  అక్కడ నుంచి రాత్రి 10.30 ప్రాంతంలో చింతకానీ స్టేషన్ కు తీసుకువచ్చి, కుమార్తె ముందు రాత్రంతా పైన గదిలో నాలుగు కానిస్టేబుల్స్ (మహిళా కానిస్టేబుల్ లేకుండా) ఒకరి తరువాత ఒకరు ఒళ్ళు హూనం అయ్యేట్లు లాఠీలతో కొట్టారు.  

దెబ్బలకు తాళలేక మరియమ్మ అరుస్తున్న అరుపులు వినే నాథుడే లేడన్నారు. ‘‘మా అమ్మను కొట్టకండి.. మా అమ్మను చంపకండి’’ అని కుమార్తె ఎంత ప్రాధేయపడ్డా పోలీసులు కనికరించలేదని, చివరకు ఉదయం 4 గంటల ప్రాంతంలో మరియమ్మను చింతకానీ నుంచి అడ్డగూడూరు స్టేషన్ కు తరలించి అక్కడ కూడా విపరీతంగా కొడితే.. దెబ్బలు భరించలేక మరియమ్మ కొడుకు ఉదయ్ కిరణ్ చేతుల్లో పోలీస్ స్టేషన్ లో ప్రాణాలు విడిచిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి దళిత గిరిజనులు పోలీసుల చేత చంపబడుతున్నారు. అయిన ఇంతవరకూ ఎక్కడ న్యాయం జరగ లేదన్నారు. 

సోమవారం ప్రెస్‌మీట్‌లో భట్టి మాట్లాడుతూ..  ‘నా చేతుల్లోనే మా అమ్మ చనిపోయిందని ఉదయ్ కిరణ్ చెబుతుంటే ఎంతో బాధాకరంగా ఉంది. ఈ ఘటనను బట్టి రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎలా పనిచేస్తోందో అర్థం అవుతోంది. కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం పోలీసులకు విచ్చలవిడి అధికారాలు ఇవ్వడం వల్ల సామాన్యులు ఎవరూ బతికే పరిస్థితి లేదు. పౌర హక్కులు లేవు. ప్రజల మీద విశృంఖలంగా పోలీసుల దాష్టికాలు పెరిగిపోతున్నాయి. టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గరనుంచి దళిత గిరిజనులు పోలీసుల చేత చంపబడుతున్నారు. అయిన ఇంతవరకూ ఎక్కడ న్యాయం జరగ లేదన్నారు. ఈ ఘటనపై రాష్ట్ర గవర్నర్ వెంటనే పూర్తి సమాచారం తెప్పించుకుని.. భాదితులకు న్యాయం చేయడంతో పాటు దోషులపై చర్యలు తీసుకోవాలి’ అని విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు