11న ఖమ్మంలో నిరసన

9 Nov, 2020 10:10 IST|Sakshi

రైతాంగ సమస్యలు పరిష్కరించాలని ట్రాక్టర్ల ర్యాలీ: భట్టి 

సాక్షి, ఖమ్మం ‌: రైతాంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11వ తేదీన ఖమ్మంలో ట్రాక్టర్లతో భారీ ర్యాలీ చేపట్టి నిరసన తెలపనున్నట్లు సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆదివారం ఖమ్మంలోని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయం సంజీవరెడ్డి భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతాంగ సమస్యలపై ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. కేసీఆర్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. ఇటీవల కురిసిన వర్షాల వల్ల పంట నష్టాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రభుత్వం వ్యవహరించడం దారుణమన్నారు. తాము చెప్పిన పంటలనే వేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ శాఖ ద్వారా ప్రచారం చేపిస్తున్నారని, ఇది సరైన విధానం కాదన్నారు. అకాలవర్షాలతో వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్న తదితర పంటలు  దెబ్బతిన్నాయన్నారు. నష్టపోయిన రైతులను ఆదుకోకుండా రబీలో కూడా తాము సూచించిన పంటలనే వేయాలని తాజాగా హెచ్చరికలు చేస్తున్నారని, దీనివల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడే ప్రమాదం ఉందని తెలిపారు.

సన్నరకం వరిపై నేటి వరకు స్పష్టత లేదన్నారు. మొక్కజొన్న వేస్తే సరైన ధర ఇవ్వబోమని చెప్తున్నారని, కేంద్రం మద్దతు ధర ప్రకటిస్తే అన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయని గుర్తు చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావు, కవిత వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అధోగతి పాలైందన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతుధర ఇవ్వలేని పరిస్థితుల్లో సర్కారు ఉందన్నారు. డబుల్‌ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలు, వైద్యం, రుణమాఫీ, వడ్డీ లేని రుణాలు తదితర పథకాల అమల్లో కేసీఆర్‌ విఫలమయ్యారని ఆరోపించారు. తొలుత కల్వకుర్తి లిఫ్టు ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ ముంపు, నష్టం వంటి అంశాలపై కాంగ్రెస్‌ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీ అధ్యక్షుడి హోదాలో ఆయన సభ్యులతో నిర్వహించిన జూమ్‌ మీటింగ్‌లో పలు సూచనలు చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, పార్టీ నగర అధ్యక్షుడు ఎండీ.జావీద్, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ నాగండ్ల దీపక్‌చౌదరి, ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ ఏ–బ్లాక్‌ అధ్యక్షుడు యర్రం బాలగంగాధర్‌ తిలక్, పుచ్చకాయల వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.

18న కల్వకుర్తి ప్రాజెక్ట్‌ పరిశీలన
ఈ నెల 18వ తేదీన సీఎల్పీ సారథ్యంలో కల్వకుర్తి ప్రాజెక్ట్‌ను సందర్శించనున్నట్లు కాంగ్రెస్‌ శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. సీఎల్పీ నేతగా తొలుత ప్రభుత్వానికి లేఖ రాస్తానని అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, కేసీఆర్‌ పాలనలో వ్యవసాయ రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందన్నారు. కల్వకుర్తి లిఫ్టు ప్రాజెక్ట్‌ను ఎవరూ సందర్శించకుండా పెద్దఎత్తున పోలీస్‌ బలగాలతో ప్రభుత్వం అడ్డుకుంటోందని చెప్పారు. కల్వకుర్తి లిఫ్టు ఏమైనా నిషేధిత ప్రాంతమా?, ఇంత రహస్యంగా దాచాలి్సన అవసరం ఎమిటని ప్రశ్నించారు. కల్వకుర్తి ప్రాజెక్ట్‌ జాతిఆస్తి అని చెప్పిన కేసీర్‌ ప్రస్తుతం ఆ దిశగా మాట్లాడటం లేదన్నారు. మొత్తం నష్టాన్ని అంచనా వేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తున్నట్లు తెలిపారు. సీఎల్పీ సారథ్యంలో ఈ కమిటీ మొత్తం ప్రాజెక్ట్‌ను పరిశీలించిన తర్వాతే 18న కల్వకుర్తి వెళ్తున్నట్లు వివరించారు.

మరిన్ని వార్తలు