Police Slapped Man Video: ఎందుకు కొట్టావు? పోలీసులకు చుక్కలు చూపించిన వ్యక్తి

8 Dec, 2021 10:07 IST|Sakshi

మహబూబాబాద్‌: ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నఘటనలు ఇటీవల ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. తాము అన్ని నిబంధలను పాటిస్తున్నా.. పోలీసులు దౌర్జన్యానికి దిగుతున్నారని కొంతమంది నిరనస కూడా తెలుపుతున్నారు. తాజాగా మహబూబాబాద్‌ జిల్లాలో చోటుచేసుకున్న ఓ  ఘటన సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాలు.. శ్రీనివాస్‌ అనే వ్యక్తి తన ఎనిమిదేళ్ల కూతురుతో కలిసి బైక్‌మీద కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు హెల్మెట్‌ ధరించలేదని దబాయిస్తూ.. బైక్‌ తాళం తీసుకున్నారు. అయితే ఆ వ్యక్తి తాను హెల్మెట్‌ ధరించానని పోలీసులకు చెప్పినా పట్టించుకోకుండా ఎస్‌ఐ మునీరుల్లా చేయి చేసుకున్నాడని శ్రీనివాస్‌ తెలిపాడు. తాను ఏ తప్పుచేయలేదని హెల్మెట్‌ ధరించినా.. లేదని దూషించి చేయి చేసుకున్నాడని ఆరోపించాడు. ఒక వేళ హెల్మెట్‌ ధరించని పక్షంలో ఫైన్‌ వేయాల్సిందని.. తనను కొట్టే హక్కు పోలీసులకు ఎవరిచ్చారని ఆవేదన వ్యక్తం చేశాడు. తప్పుచేయని తనపై పోలీసు ఎందుకు చేయి చేసుకున్నాడని నిరసిస్తూ ఆయన రోడ్డుపై బైఠాయించాడు. ఈ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

వీడియో ప్రకారం.. పోలీసుల ప్రవర్తనతో శ్రీనివాస్‌ కూతురు అతన్ని పట్టుకొని ఏడవసాగింది. ‘మనం తప్పు చేయలేదు తల్లి.. నువ్వు ఏడవకు’ అంటూ శ్రీనివాస్‌ చెబుతాడు. అక్కడ ఉన్నవారు కూడా శ్రీనివాస్‌కు మద్దతు తెలిపారు. ఇక విషయం పెద్దదిగా మారుతుందని గ్రహించిన పోలీసులు సదరు వ్యక్తిని అక్కడ నుంచి బలవంతంగా పంపించివేస్తారు. ఈ ఘటనపై జిల్లా పోలీసు ఇంచార్జ్‌ స్పందిస్తూ.. ఎస్‌ఐ మునీరుల్లాను సదరు వ్యక్తి దూషించాడని తెలిపారు. మరోవైపు తన తండ్రి హెల్మెంట్‌ ధరించినా..  ధరించలేదని దూషిస్తూ పోలీసులు బైక్‌ తాళం తీసుకున్నారని అతని కుమార్తె ఏడుస్తూ చెప్పింది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ఎక్కడ ఉంది? అంటూ  కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు