అమానుషం: చెరువులో చేపలు పట్టారని బట్టలిప్పి చెట్టుకు కట్టేసి కొట్టి

28 Oct, 2022 09:56 IST|Sakshi
అక్రమంగా చేపలు పట్టాడని గిరిజనుడు జగన్‌ను బట్టలు విప్పి చెట్టుకు కట్టేసిన దృశ్యం 

గిరిజనులపై కాంట్రాక్టర్ల అమానుషం

రూ.25 వేలు జరిమానా చెల్లించాలని పెద్దల తీర్పు

కేసు పెట్టాలని బాధితుల డిమాండ్‌ 

వరంగల్‌ జిల్లాలో ఘటన

నల్లబెల్లి: చెరువులో అనుమతి లేకుండా చేపలు పట్టిన పాపానికి గిరిజనులను బట్టలు ఊడదీసి చెట్టుకు కట్టేసి కొట్టిన అమానుష ఘటన వరంగల్‌ జిల్లా నల్లబెల్లి మండలం అర్షనపల్లిలో గురువారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ మండలం కార్లాయి గ్రామానికి చెందిన చిరుకూరి సుమన్, నల్లబెల్లి మండలం పద్మాపురం గ్రామానికి చెందిన ఇసాల జగన్, కన్నారావుపేట ఉప సర్పంచ్‌ తురుస అశోక్, గట్టి చెన్నయ్యలు పద్మపురం సమీపంలోని అర్షనపల్లి చెరువులో చేపలు పట్టేందుకు గురువారం ఉదయం వెళ్లారు.

చేపలు పడుతుండగా విషయం తెలుసుకున్న ఆ చెరువు కాంట్రాక్టర్‌లు సిద్ద గణేశ్, సురేశ్‌లతోపాటు మరికొందరు వెళ్లి ఆ నలుగురినీ వెంబడించారు. చిరుకూరి సుమన్‌ పట్టుబడగా.. మిగతా ముగ్గురూ  పారిపోయారు. సుమన్‌ కాళ్లు, చేతులను వెనుకవైపు ఒంచి కట్టేసి బోల్లోనిపల్లికి తరలించారు. గ్రామంలో చెట్టుకు వలలతో కట్టేసి దాడి చేశారు.  పారిపోయిన ఇసాల జగన్‌ బోల్లోనిపల్లి గ్రామానికి చేరుకుని కాంట్రాక్టర్‌తో చర్చించేందుకు ప్రయత్నించగా అతన్ని సైతం దూషిస్తూ బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి దాడి చేశారు.

విషయం తెలుసుకున్న బాధిత కుటుంబ సభ్యులు గ్రామపెద్దలను ఆశ్రయించారు. పంచాయితీ నిర్వహించి అక్రమంగా చేపలు పట్టిన నలుగురు వ్యక్తులూ రూ.25వేల జరిమానా చెల్లించాలని తీర్మానించారు. విషయం తెలుసుకున్న పోలీసులు పద్మాపురం గ్రామానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి శిక్షించాలని బాధితులు కోరుతున్నారు.

>
మరిన్ని వార్తలు