సంబంధంలేని గొడవలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయిన యువకుడు

20 Sep, 2022 15:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గొడవతో సంబంధం లేదు... గొడవ పడుతున్న వారితోనూ ఎటువంటి స్నేహం లేదు.. స్నేహితుడి ఇంటి వద్ద దించేందుకని వచ్చిన యువకుడు సంబంధం లేని తగాదాలోకి వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకున్న విషాదకర సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికులు, ఇన్‌చార్జి సీఐ నర్సింగ్‌ యాదయ్య కథనం ప్రకారం.. జిల్లెలగూడ బాలాజీకాలనీలో అద్దెకు ఉండే మణికంఠ తన స్నేహితులైన నరేందర్, నవీన్, సాయికుమార్, జైపాల్‌తో కలిసి శ్రీశైలం వెళ్లి ఆదివారం రాత్రి 11 గంటలకు కర్మన్‌ఘాట్‌ గ్రీన్‌పార్కు కాలనీకి వచ్చి ప్రవీణ్, భార్గవ (21)లతో కలిసి నిర్మానుష్య ప్రదేశంలో అర్ధరాత్రి వరకు మద్యం సేవించారు.

ఆ తర్వాత మణికంఠ తనను ఇంటి వద్ద దించేందుకు టీకేఆర్‌ కమాన్‌ వద్ద నివాసముండే మరో స్నేహితుడు శరత్‌కు ఫోన్‌ చేసి పిలిపించుకున్నాడు. దీంతో శరత్‌ తన ద్విచక్ర వాహనంపై మణికంఠను తీసుకుని బాలాజీకాలనీలోని ఇంటికి వచ్చి తలుపు ఎంత కొట్టినా మణికంఠ తల్లి సంధ్యారాణి తలుపు తీయలేదు. ఇద్దరి సెల్‌ఫోన్‌లలో బ్యాలెన్స్‌ లేకపోవడంతో అదే వీధిలో నివాసముండే రమాదేవి తన మనువరాలి తొట్టెల శుభకార్యం (21వరోజు) చేసుకుంటున్నారు.

దీంతో మణికంఠ, శరత్‌లు అక్కడికి వెళ్లి మా అమ్మపేరు సంధ్యారాణి.. తలుపు ఎంతకూ తీయడం లేదు. మా సెల్‌ఫోన్‌లలో బ్యాలెన్స్‌ అయిపోయిందని ఫోన్‌ ఇస్తే కాల్‌ చేసుకుంటామని రమాదేవిని అడిగారు. దీంతో రమాదేవి బంధువు అయిన మేడ్చల్‌ ఎక్సైజ్‌ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రూపేష్‌కుమార్‌ ఈ అర్ధరాత్రి వేళ వచ్చి సెల్‌ఫోన్‌ అడుగుతున్నారు ఎందుకని ప్రశ్నించాడు. శరత్, రూపేష్‌ కుమార్‌ల మధ్య మాటమాట పెరిగి వాగ్వివాదం జరగడంతో అందరూ కలిసి కావాలనే అల్లరి చేస్తున్నారని శరత్, మణికంఠను కొట్టి అక్కడి నుంచి వెళ్లగొట్టారు.  
చదవండ: వ్యభిచారం నిర్వహిస్తూ పట్టుబడ్డ ఏఆర్‌ కానిస్టేబుల్‌

ఇరువర్గాల మధ్య ఘర్షణతో.. 
అనంతరం ఇద్దరు కలిసి చందన చెరువు కట్ట వద్దకు వెళ్లి అక్కడే జన్మదిన వేడుకలు జరుపుకుంటున్న వారి వద్ద నుంచి.. శరత్‌ సెల్‌ఫోన్‌ తీసుకుని బాలాపూర్‌ సాయినగర్‌కు చెందిన నరేందర్‌కు ఫోన్‌ చేసి తమపై దాడి చేశారని చెప్పాడు. తనను ఇంటి వద్ద దించేందుకు వెంట వచ్చిన భార్గవతో కలిసి వెంటనే నరేందర్‌ చెరువు కట్ట వద్దకు చేరుకున్నాడు. దీంతో పాటు శరత్‌ మరో స్నేహితుడైన ప్రవీణ్‌ ఇంటికి వెళ్లి బైక్‌పై ఎక్కించుకుని వచ్చాడు. ఐదుమంది కలిసి అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో శుభకార్యం జరుగుతున్న రమాదేవి ఇంటికి వెళ్లారు. అంతా మద్యం సేవించి ఉండటంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.

ఈ ఘర్షణలో ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ రూపేష్‌కుమార్‌పై ఇటుకతో దాడి చేయగా బంధువులంతా కోపోద్రిక్తులై యువకులను చితకబాదారు. పారిపోతున్న క్రమంలో భార్గవ కిందపడగా తీవ్రంగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతన్ని ఓవైసీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడు భార్గవ సైదాబాద్‌ వాసి అని, మెడికల్‌ డిస్ట్రిబ్యూషన్‌లో సేల్స్‌మెన్‌గా పనిచేస్తుంటాడని సీఐ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియాకు తరలించి దాడికి పాల్పడిన రూపేష్‌కుమార్, రమాదేవితో పాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ యాదయ్య పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు