మెకానిక్‌తో వచ్చి.. రహస్య కెమెరా అమర్చి!.. వీడియోలు, ఫొటోలు గోడల మీద అతికిస్తానంటూ..

2 Dec, 2022 06:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అల్వాల్‌కు చెందిన ఓ మహిళ మొబైల్‌ షాప్‌ను నిర్వహిస్తుంది. అక్కడికి వివో మొబైల్‌ కంపెనీలో టీమ్‌ లీడర్‌గా పనిచేస్తున్న గాజులరామారానికి చెందిన సయ్యద్‌ రియాజ్‌ సెల్‌ఫోన్‌ విక్రయాలు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు తరుచు వచ్చేవాడు. ఈ క్రమంలో సదరు మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించేవాడు. ఓ రోజు మహిళ షాపులో ఉన్న సమయంలో తన భర్తతో సెల్‌ఫోన్‌లో గీజర్, ఏసీ రిపేర్‌ విషయమై మాట్లాడుతుండగా.. అదే సమయంలో అక్కడికి వచ్చిన రియాజ్‌ మెకానిక్‌ను ఏర్పాటు చేస్తానని మహిళను ఒప్పించాడు.

మర్నాడు మెకానిక్‌ను తీసుకుని మహిళ ఇంటికెళ్లిన రియాజ్‌.. ఆమెకు తెలియకుండా ఇంట్లో రహస్య కెమెరాను అమర్చాడు. ఈ క్రమంలో ఆమె ఫొటోలు, వీడియోలు చిత్రీకరించి ఆమెను బ్లాక్‌మెయిల్‌ చేయడం మొదలుపెట్టాడు. తన వద్ద నగ్న వీడియోలు, ఫొటోలు ఉన్నాయని, ఇంటికి పిలవకపోతే వీటిని వైరల్‌ చేస్తానని బెదిరించసాగాడు. తాను చెప్పినట్లు నడుచుకోకపోతే ఫొటోలు ప్రింట్‌ తీసి ఆమె ఇంటి పరిసరాల్లో గోడల మీద అతికిస్తానని బెదిరించాడు.

ఓ రోజు మహిళ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి చొరబడ్డాడు. భయంతో ఆమె కేకలు పెట్టడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో బాధితురాలు పేట్‌ బషీరాబాద్‌ షీ టీమ్స్‌ను సంప్రదించింది. వారి సూచన మేరకు అల్వాల్‌ పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. 
►ఈ ఒక్క కేసే కాదు.. పార్క్‌లో వాకింగ్‌ చేస్తున్న మహిళపై ఫ్లాష్‌ లైట్లు కొట్టిన ఆకతాయి, లిఫ్ట్‌లో మైనర్‌ బాలికతో అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరీ, పెళ్లి చేసుకుంటానని గర్భవతిని చేసి పరారైన వ్యక్తి తదితరులకు షీటీమ్స్‌ చెక్‌ పెట్టింది. 

126 మంది ఆకతాయిలకు కౌన్సెలింగ్‌.. 
గత నెలలో సైబరాబాద్‌ షీ టీమ్స్‌కు 98 ఫిర్యాదులు అందాయి. వీటిల్లో 29 కేసులు నమోదు చేయగా.. 4 క్రిమినల్‌ కేసులు, 25 పెట్టీ కేసులున్నాయి. అత్యధికంగా 74 ఫిర్యాదులు వాట్సాప్‌ ద్వారా అందాయి. గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలోని ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ సేఫ్టీ వింగ్‌లో 126 మంది ఆకతాయిలకు గురువారం కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఇందులో 20 మంది మైనర్లున్నారు. 

అర్ధరాత్రి డెకాయ్‌.. 
ఐటీ కంపెనీలకు నిలయమైన సైబరాబాద్‌లో రాత్రి వేళల్లో కూడా పలు కంపెనీలు పనిచేస్తుంటాయి. దీంతో మహిళా ఉద్యోగుల భద్రత, రక్షణ కోసం సైబరాబాద్‌ షీ టీమ్స్‌ అర్ధరాత్రి డెకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహిస్తున్నాయి. ఫుడ్‌ కోర్ట్‌లు, వసతి గృహాలు, మెట్రో స్టేషన్లు, మాదాపూర్‌లోని 100 ఫీట్ల రోడ్, కూకట్‌పల్లి ఏరియా బస్‌ స్టాప్‌లు తదితర ప్రాంతాల్లో మఫ్టీలో సంచరిస్తున్న షీ టీమ్స్‌ బృందాలు  గత నెలలో మహిళలను వేధిస్తున్న 60 మంది ఆకతాయిలను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. గత నెల రోజుల్లో సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌ పరిధిలో బహిరంగ ప్రదేశాల్లో 477 డెకాయ్‌ ఆపరేషన్స్‌ నిర్వహించగా 31 మంది ఆకతాయిలు పట్టుబడ్డారు.  

మరిన్ని వార్తలు