లాక్‌డౌన్‌.. నన్నే బయటకు వెళ్లనివ్వవా?

25 May, 2021 10:52 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

రిమాండ్‌కు నిందితుడు 

సాక్షి, హిమాయత్‌నగర్‌: లాక్‌డౌన్‌ కారణంగా పోలీసులు బయటకు వెళ్లనివ్వట్లేదనే కారణంతో ఓ హోంగార్డు బైక్‌ను తగలబెట్టాడు ఓ ప్రబుద్ధుడు. నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాల్లోకి వెళితే... స్థానిక ఫరీద్‌బస్తీకు చెందిన మహ్మద్‌ సికిందర్‌ ఇంటెల్లిజెన్స్‌ సెక్యూరిటీ వింగ్‌లో హోంగార్డు(డ్రైవర్‌)గా పనిచేస్తున్నాడు. ఈ నెల 21వ తేదీ శుక్రవారం డ్యూటీ నుంచి వచ్చిన సికిందర్‌ తన బైక్‌ని ఇంటి వద్ద రోడ్డుపై పార్క్‌ చేసి ఇంట్లోకి వెళ్లిపోయాడు. అదేరోజు అర్ధరాత్రి తన టూవీలర్‌ తగలబడుతున్న మంటల శబ్ధం వినిపించి బయటకు వచ్చి నీళ్లు కొట్టగా.. అప్పటికే బైక్‌ మొత్తం దగ్ధం అయ్యింది.

దీంతో శనివారం ఉదయం నారాయణగూడ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన సికిందర్‌ ఇదే బస్తీకు చెందిన మహ్మద్‌ అబిద్‌ అనే వ్యక్తిపై అనుమానం ఉందని పేర్కొన్నాడు. ఆ దిశగా విచారణ జరిపిన పోలీసులకు కొన్ని ఆశక్తికరమైన విషయాలు వెలువడ్డాయి. మహ్మద్‌ అబిద్‌ అనే వ్యక్తి కొంతకాలంగా మానసికపరమైన ఒత్తిడితో ఉంటున్నాడు. సికిందర్‌కు అబిద్‌లకు మధ్య ఇటీవల చిన్నపాటి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. అయితే లాక్‌డౌన్‌ కారణంగా అబిద్‌ను పోలీసులు బయటకు వెళ్లనివ్వడం లేదనే కక్షతో సికిందర్‌ బైక్‌ని తగలబెట్టినట్లు విచారణలో వెల్లడైంది. దీంతో సోమవారం అబిద్‌ను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు పంపారు. 

గతంలో పలు ఫిర్యాదులు.. 
మహ్మద్‌ అబిద్‌పై గతంలో ఫరీద్‌ బస్తీకి చెందిన పలువురు ఫిర్యాదులు చేశారు. అబిద్‌ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, రాళ్లు వేయడం, అందరూ చూస్తుండగానే ఎక్కడపడితే అక్కడ మూత్రవిసర్జన చేస్తుండేవాడు. దీంతో విసిగెత్తిన పలువురు మహిళలు నారాయణగూడ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. అబిద్‌పై పలు పెట్టి కేసులు నమోదు చేసి వదిలేశారు. 

చదవండి: యాంటీ వైరల్, ఫంగల్‌ డ్రగ్స్‌: ‘దొరికిన’వన్నీ డీఎంహెచ్‌ఓలకే!
Hyderabad: సాబ్‌.. ఛోడ్‌దో సాబ్‌.. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు