డబ్బుల్లేక భార్యతో గొడవ.. కూతుళ్లతో విషం తాగి

10 Apr, 2021 15:13 IST|Sakshi

సదాశివపేట రూరల్‌ (సంగారెడ్డి): తీవ్ర ఆర్థిక కష్టాలు ఎదురవడంతో పిల్లలను పోషించలేక వారికి కూల్‌డ్రింక్‌లో విషం కలిపి నవ్వుతూ తాగండర్రా అంటూ చెప్పి ఆపై ఆయన కూడా తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డారు. అయితే తాగిన వెంటనే తప్పు చేశామని భావించి వెంటనే ఈ విషయాన్ని తన కుటుంబసభ్యులకు చెప్పాడు. వాళ్లు వెంటనే ఆస్పతత్రికి తరలించడంతో ఇద్దరు ప్రాణాలు దక్కగా ఒకరి ప్రాణం పోయింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలంలో చోటుచేసుకుంది.

ఆత్మకూర్‌ గ్రామానికి చెందిన శివకుమార్‌, లలిత భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కుమార్తెలు నవ్యశ్రీ (4), సిరి (5) ఉన్నారు. వీరు హైదరాబాద్‌లో నివసిస్తుండేవారు. అయితే ఇటీవల ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం మళ్లీ గొడవ జరగడంతో భర్త శివకుమార్‌ పిల్లలను తీసుకుని హైదరాబాద్‌ నుంచి స్వగగ్రామం ఆత్మకూర్‌కు వచ్చాడు. రాత్రి కూల్‌డ్రింక్స్‌లో విష గుళికలు కలిపేశాడు. పిల్లలకు తాగించిన అనంతరం ఆయన కూడా తాగాడు. అనంతరం బయటకు వెళ్లి శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకు ఇంటికి వచ్చి చూడగా పిల్లలు అపస్మారక స్థితిలోకి చేరుకున్నారు.

దీంతో ఆందోళన చెందిన శివకుమార్‌ వెంటనే తాను చేసిన పనిని కుటుంబసభ్యులకు చెప్పాడు. వెంటనే కుటుంబసభ్యులు పిల్లలను, అతడిని ఆస్పతత్రిలో చేర్పించారు. అయితే అప్పటికే నవ్యశ్రీ మృతి చెందింది. సిరి, శివకుమార్‌ ప్రాణాపాయంతో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతున్నారు. తండ్రి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సంతోశ్‌కుమార్‌ తెలిపారు.

చదవండి: సెల్ఫీ తీసుకుంటూ ఫోన్‌తో నీటిలోకి కొట్టుకుపోయిన బాలుడు

మరిన్ని వార్తలు