'ప్రాణంగా పెంచుకున్నా.. న్యాయం చేయండి సారూ..'

22 Apr, 2021 00:39 IST|Sakshi

సాక్షి, సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలోని చందుర్తి పోలీస్‌స్టేషన్‌.. రాత్రి 8 దాటింది. మరికాసేపట్లో రాత్రి కర్ఫ్యూ.. దాని అమలు తీరుతెన్నులపై ఠాణా సిబ్బంది తర్జనభర్జన పడుతూ బిజీగా ఉన్నారు. అంతలో చేత్తో చచ్చిన కోడిని పట్టుకుని ఓ యువకుడు స్టేషన్‌లోకి ఎంటరయ్యాడు. ‘నేను ప్రాణంగా పెంచుకుంటున్న కోడిపెట్టను ఇసుక ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపేశారు. న్యాయం చేయండి సారూ..’ అంటూ యువకుడు అనేసరికి ఏం చేయాలో, అతడికేం చెప్పాలో పోలీసులకు తోచలేదు. కానీ, తరువాత విషయం అర్థమై కడుపుబ్బా నవ్వుకున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. చందుర్తి మండలం బండపల్లికి చెందిన గసికంటి రాజు (32) గల్ఫ్‌లో ఉండేవాడు. కరోనా నేపథ్యంలో ఇంటికి వచ్చేసి వ్యవసాయం చేస్తూనే పది కోళ్లనూ పెంచుకుంటున్నాడు. అందులోని ఓ కోడిపెట్ట మంగళవారం తెల్లవారుజామున చనిపోయింది. ఇసుక ట్రాక్టర్‌తో దాన్ని ఢీకొట్టి చంపేశారంటూ రాజు అదేరోజు రాత్రి ఠాణా మెట్లెక్కినప్పుడు పై సన్నివేశం చోటుచేసుకుంది. ప్రేమగా పెంచుకుంటున్న తన కోడిని ఢీకొట్టి చంపిన వారిపై కేసు పెట్టి, తనకు న్యాయం చేయాలని రాజు వేడుకోగా, ‘మాకున్న కేసుల పంచాయితీకి మళ్లీ ఇదొకటా.. చూద్దాంలే’ అంటూ పోలీసులు సర్దిచెప్పి ఇంటికి పంపేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు