Coronavirus: కొడుకా.. వెళ్లిపోయావా..! 

2 Jun, 2021 06:40 IST|Sakshi

హిమాయత్‌నగర్‌:  ‘కొడుకా మేం బతికుండగానే మమ్మల్ని వదిలేసి వెళ్లిపోయావా? మేమేం పాపం చేశాం బిడ్డా’ అంటూ కొడుకు మరణాన్ని తట్టుకోలేక రోదించిన ఆ తల్లిదండ్రులను ఆపడం ఎవరి వల్లా కాలేదు. 21రోజుల పాటు కోవిడ్‌తో పోరాడి మంగళవారం ఉదయం మృతి చెందిన కొడుకు మృతదేహాన్ని అంబులెన్స్‌లో తల్లిదండ్రులు తీసుకెళ్లారు.

ఇబ్రహీంపట్నం మండలం ఉప్పరిగూడ గ్రామానికి చెందిన నరకూడి ఇబ్రాము, ఆండాలు కుమారుడు ప్రభాకర్‌ (32) కోవిడ్‌తో  కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రిలో మృతిచెందాడు. మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలిద్దామంటే వారు రూ.10వేలు అడిగారు. రెండు గంటలపాటు ఎదురుచూసి అంత డబ్బు భరించే స్థోమతలేక ఆటో ట్రాలీలోనే కుమారుడి మృతదేహాన్ని తీసుకెళ్లారు.

కోఠి ఈఎన్‌టీలో బ్లాక్‌ ఫంగస్‌తో ఒకరి మృతి 
సుల్తాన్‌బజార్‌: కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో మొదటిసారి బ్లాక్‌ఫంగస్‌ పేషెంట్‌ మృతి చెందాడు. మహబూబాబాద్, బోదతండాకు చెందిన బోడా శ్రీను(50) గత నెల 30న బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో ఈఎన్‌టీ ఆసుపత్రిలో చేరాడు. అతనికి డయాబెటిక్‌తో పాటు హైపర్‌టెన్షన్, అస్తమా ఉన్నాయి. కరోనా వచ్చి తగ్గిన తర్వాత శ్రీనుకు కన్నులో బ్లాక్‌ ఫంగస్‌ సోకడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. మంగళవారం గుండెపోటు రావడంతో మృతిచెందాడు.

దీంతో కోఠి ఈఎన్‌టీ ఆసుపత్రిలో తొలి బ్లాక్‌ఫంగస్‌ మృతికేసు నమోదైంది. ఇదిలా ఉండగా వైద్యులు సకాలంలో శస్త్రచికిత్స చేయలేదని..ఆపరేషన్‌ చేస్తామని చేయలేదని బంధువులు వాపోయారు. షుగర్‌ ఎక్కువగా ఉండడంతో పాటు హైపర్‌టెన్షన్‌ సమస్య వల్ల ఆపరేషన్‌ వాయిదా వేశామని, బాధితుడు గుండెపోటుతో మాత్రమే మృతిచెందాడని ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ శంకర్‌ తెలిపారు.
చదవండి: ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్సలకు ధరలు ఎందుకు నిర్ణయించలేదు?

మరిన్ని వార్తలు