నిరుద్యోగి సునీల్‌ మృతి, గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత

2 Apr, 2021 15:22 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: కాకతీయ యూనివర్సిటీలో ఆత్మహత్యాయత్నం చేసిన నిరుద్యోగి బోడ సునీల్ నాయక్‌‌.. నిమ్స్‌లో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారు జామున మృతి చెందాడు. ఏడేళ్లు అవుతున్నా ప్రభుత్వం జాబ్ నోటిఫికేషన్ ప్రకటించడం లేదని ఆవేదన చెంది మార్చి 27న సునీల్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి విదితమే. పురుగుల మందు తాగిన సునీల్‌ను విద్యార్థులు.. ఎంజీఎంకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో నిమ్స్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సునీల్‌ మరణించాడు. సునీల్ స్వస్థలం వరంగల్ జిల్లా గూడూరు మండలం గుండెంగ సోమ్లా తండా.

గాంధీ ఆస్పత్రి వద్ద ఉద్రిక్తత
సునీల్ మృతదేహాన్ని నిమ్స్ నుండి గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గాంధీ ఆసుపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. గాంధీ ఆసుపత్రికి పెద్ద ఎత్తున చేరుకున్న  బీజేపీ నేతలు, విద్యార్థులు, సునీల్‌ బంధువులు మార్చూరి ముందు ఆందోళన చేశారు. సీఎం కేసీఆర్‌ తక్షణమే స్పందించి.. సునీల్ కుటుంబానికి న్యాయం  చేయాలని డిమాండ్‌ చేశారు.  భారీగా మోహరించిన పోలీసులు.. ఆందోళన చేస్తున్న విద్యార్థులను అరెస్ట్‌ చేశారు.

కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలి: బండి సంజయ్‌
సునీల్ నాయక్ కుటుంబాన్ని గాంధీ ఆసుపత్రి వద్ద రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి​ పరామర్శించారు. అనంతరం బండి సంజయ్‌ మీడియాతో మాట్లాడుతూ, సునీల్ నాయక్‌ది ఆత్మహత్య కాదని.. ఇది కేసీఆర్ సర్కార్‌ హత్య అంటూ ధ్వజమెత్తారు. ఆత్మహత్య చేసుకునే ముందు సునీల్.. కేసీఆర్‌ పేరు ప్రస్తావించాడన్నారు. ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు కాబట్టే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. కేసీఆర్‌పై కేసు పెట్టాలని ఆయన డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం వెంటనే ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యోగులు తొందరపడి ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టి ఉద్యోగాలు కల్పిస్తామని బండి సంజయ్‌ అన్నారు.

మరిన్ని వార్తలు