మింగేస్తున్న డ్రగ్స్‌

1 Apr, 2022 02:45 IST|Sakshi
పట్టుబడిన డ్రగ్స్‌ను  పరిశీలిస్తున్న డీఎస్‌ చౌహాన్‌

మాదకద్రవ్యాల ఓవర్‌ డోస్‌తో హైదరాబాద్‌లో తొలి మరణం

గ్రేటర్‌ నగరంలో చాపకింద నీరులా మాదకద్రవ్యాల దందా 

గోవాతోపాటు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న డ్రగ్స్‌ 

ఇక్కడి నుంచి గోవా వెళ్లి మత్తులో జోగుతున్న యువత

బానిసలై జీవచ్ఛవాలుగా మారుతున్న వైనం.. 

సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల నుంచి విద్యార్థుల దాకా అలవాటు

మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌ 

 ఫ్లాట్‌లోనే డ్రగ్స్‌ ల్యాబ్‌.. విడివిడిగా రసాయనాల కొనుగోళ్లు 

‘చంగా’తయారుచేసి అమ్ముతుండగా పట్టుకున్న నార్కోటిక్‌ అధికారులు

హైదరాబాద్‌లో ఒకేరోజున బయటపడిన మూడు ఘటనలు ఇవి. ఇప్పటిదాకా డ్రగ్స్‌ రవాణా, వాడకమే బయటపడితే ఇప్పుడు డ్రగ్స్‌తో ప్రాణాలు పోగొట్టుకున్నవారు, ఆరోగ్యం దెబ్బతిన్నవారు, సొంతంగానే డ్రగ్స్‌ తయారు చేసి అమ్ముతున్నవారి ఉదంతం బయటపడటం కలకలం రేపుతోంది. ఓవైపు గంజాయి, ఓపియం వంటి మాదకద్రవ్యాలతోపాటు మరోవైపు ఎక్స్‌టసీ, చరస్, ఎల్‌ఎస్‌డీ, ఎండీఎంఏ వంటి సింథటిక్‌ డ్రగ్స్‌ దందా కూడా విచ్చలవిడిగా జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది.

యూట్యూబ్‌లో చూసి డ్రగ్స్‌ తయారు చేసి..
► అతడో మామూలు ఇంజనీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. మొదట్లో డ్రగ్స్‌కు బానిసయ్యాడు. దానికి డబ్బుల కోసం డ్రగ్స్‌ అమ్మే పెడ్లర్‌గా మారాడు. చివరికి యూట్యూబ్‌లో చూసి డ్రగ్స్‌ తయారు చేయడం నేర్చుకున్నాడు. ఫార్మసీల్లో, ఆన్‌లైన్‌లో పరికరాలు, రసాయనాలు కొనుగోలు చేసి.. ఓ ఫ్లాట్‌లో డ్రగ్స్‌ ల్యాబ్‌నే ఏర్పాటు చేసుకున్నాడు. ‘చంగా’గా పిలిచే డ్రగ్‌ను తయారు చేసి తెలిసినవారికి అమ్ముతూ వచ్చాడు. తాజాగా పోలీసులకు పట్టుబడ్డాడు. 

► అతను 23 ఏళ్ల యువకుడు.. చదువుకునే రోజుల్లోనే స్నేహితులతో కలిసి డ్రగ్స్‌కు అలవాటుపడ్డాడు. అంతా గోవా వెళ్లి మరీ పార్టీలు చేసుకుంటూ డ్రగ్స్‌కు బానిసలయ్యారు. కొద్దిరోజుల కింద ఇలాగే గోవా వెళ్లినప్పుడు సదరు యువకుడు మితిమీరి డ్రగ్స్‌ తీసుకున్నాడు. ఓవర్‌డోస్‌ కావడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. నరాల పటుత్వం కోల్పోయి మంచానపడి.. మూడు రోజుల కింద చనిపోయాడు. రాష్ట్ర చరిత్రలో అధికారికంగా పోలీసు రికార్డుల్లోకి ఎక్కిన డ్రగ్స్‌ మరణం ఇదే. ఆ పార్టీలో విపరీతంగా డ్రగ్స్‌ తీసుకున్న మరికొందరూ అనారోగ్యంతో ఉన్నట్టు తెలిసింది. పోలీసులు ఓ డ్రగ్స్‌ విక్రేతను, అతడి దగ్గర కొనుగోలు చేసిన ముగ్గురు వినియోగదారులను అదుపులోకి తీసుకున్న క్రమంలో.. ఈ డ్రగ్స్‌ మరణం విషయం బయటికి రావడం గమనార్హం.

అక్కడ మరో నలుగురు.. 
► సికింద్రాబాద్‌ ప్రాంతంలో గంజాయి నుంచి తయారు చేసే హాష్‌ఆయిల్‌ డ్రగ్‌ను విక్రయిస్తున్న ఇద్దరిపై పోలీసులు నిఘాపెట్టారు. వారితోపాటు డ్రగ్‌ కొనేందుకు వచ్చిన మరో ఇద్దరినీ పట్టుకున్నారు. అప్పటికే డ్రగ్స్‌ కొన్న మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: రసాయన శాస్త్రం చదవలేదు.. ఫార్మా ఇండస్ట్రీలో పనిచేయలేదు.. అయితేనేం యూట్యూబ్‌లో చూశాడు.. ఓ ఫ్లాట్‌లో సొంతంగా ల్యాబ్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ‘చంగా’గా పిలిచే సింథటిక్‌ డ్రగ్‌ ‘డైమిథైల్‌ థ్రెప్టోమైన్‌ (డీఎంటీ)’తయారుచేసి విక్రయించడం మొదలుపెట్టాడు. చివరికి గురువారం ‘హైదరాబాద్‌ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌–న్యూ)’అధికారులకు పట్టుబడ్డాడు. బషీర్‌బాగ్‌ కమిషనరేట్‌లో అదనపు సీపీ డీఎస్‌ చౌహాన్‌ ఈ వివరాలు వెల్లడించారు. 

మొదట డ్రగ్స్‌కు అలవాటై.. 
సూర్యాపేట జిల్లాకు చెందిన కె.శ్రీరామ్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. విద్యార్థి దశ నుంచే అతడికి మాదకద్రవ్యాల వినియోగం అలవాటైంది. తర్వాత ఇతరులకు విక్రయించడం మొదలుపెట్టాడు. కొని అమ్మడంలో రిస్క్‌ ఉందని, తానే డ్రగ్స్‌ తయారు చేయాలని నిర్ణయించుకున్నాడు. యూట్యూబ్‌లో, వేర్వేరు వెబ్‌సైట్లలో డ్రగ్స్‌ తయారీపై అధ్యయనం చేశాడు. ‘చంగా’ తయారీ తేలిక అని భావించాడు. రహస్యంగా తయారు చేయడం కోసం.. కొండాపూర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నాడు. హైదరాబాద్‌లో వివిధ రసాయనాలు విక్రయించే దుకాణాలకు వెళ్లి.. తానో కెమిస్ట్రీ విద్యార్థినంటూ పరిచయం చేసుకున్నాడు.

పలు రకాల రసాయనాలు, ఉపకరణాలు కొన్నాడు. మెడికల్‌ షాపులు, అమెజాన్‌ లాంటి వెబ్‌సైట్ల నుంచి మరికొన్నింటిని ఖరీదు చేశాడు. వీటితో చంగా డ్రగ్‌ పొడిని తయారుచేశాడు. దాన్ని పరిచయస్తులకు గ్రాముకు రూ.8వేల చొప్పున విక్రయించేవాడు. ఒక్కో గ్రాము 20 మంది వినియోగించే అవకాశం ఉండటం, దీని ప్రభావం ఎక్కువ కావడంతో గిరాకీ పెరిగింది. ముక్కుతో పీల్చే ఈ డ్రగ్‌తో కొన్ని గంటలు తీవ్ర నిషా ఉంటుందని పోలీసులు చెప్తున్నారు. 

గట్టిగా నిఘాపెట్టి..: శ్రీరామ్‌ దగ్గర బొల్లారం ప్రాంతానికి చెందిన ఎస్‌.దీపక్‌కుమార్‌ జాదవ్‌ డ్రగ్స్‌ కొని వాడేవాడు. ఈక్రమంలోనే ‘హెచ్‌–న్యూ’ కానిస్టేబుల్‌ సత్యనారాయణకు సమాచారం అం దింది. దీంతో ఇన్‌స్పెక్టర్‌ పి.రాజేష్‌ నేతృత్వంలోని బృందం 15 రోజుల నుంచి నిఘా పెట్టి గురువారం జూబ్లీహిల్స్‌లో అదుపులోకి తీసుకుంది. శ్రీరామ్‌ ఫ్లాట్‌లో తనిఖీలు చేసి 8గ్రాముల చంగాను, దాని తయారీకి వాడే రసాయనాలు, పరికరాలను స్వాధీనం చేసుకుంది. వీటిని శ్రీరామ్‌ ఎప్పుడ కొన్నాడనేది ఆరా తీస్తున్నారు. వాటిలో నిషేధిత, నియం త్రిత పదార్థాలు ఉంటే విక్రయించిన వారిపై చర్య లు తీసుకుంటామని డీఎస్‌ చౌహాన్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు