ఫోన్‌ మాట్లాడుతూ 60 అడుగుల లోతైన బావిలో..కేకలు వేసినా ఫలితం లేదు

3 Jul, 2021 21:25 IST|Sakshi
బావిలో చిక్కుకున్న చంద్రశేఖర్‌

కాలుజారి బావిలో పడిన వ్యక్తి..

చెట్టు వేర్లను పట్టుకుని రాత్రంతా బతుకుపోరు

ఎట్టకేలకు రక్షించిన అగ్నిమాపక సిబ్బంది.. ఏపీలోని చిత్తూరులో ఘటన

పలమనేరు: ఫోన్‌ మాట్లాడుతూ.. పరాకుగా కాలుజారి 60 అడుగుల లోతున్న పాడుబడ్డ బావిలో పడిపోయాడు. ఈత రావడంతో కొద్దిసేపు ఈది చెట్ల వేర్లను పట్టుకుని నిలదొక్కుకున్నాడు. రక్షించమని కేకలు వేశాడు. నిర్మానుష్యంగా ఉన్న అటువైపు ఎవరూ రాకపోవడంతో ప్రయోజనం లేకపోయింది. దాదాపు 17 గంటల తర్వాత అతడి కేకలు పశువులు మేపుకొనే వ్యక్తికి వినిపించాయి. దీంతో అతడి ప్రాణాలు దక్కాయి. మరో 3 గంటలకు అతడిని పైకి తీశారు. మొత్తం 20 గంటలపాటు మృత్యుపోరాటం చేశాడతడు. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది.

పలమనేరుకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ దళారి చంద్రశేఖర్‌ గురువారం మధ్యాహ్నం పట్టణానికి సమీపంలోని ఓ దాబాలో భోజనం చేసి ఫోన్‌ మాట్లాడుతుండగా, దాబా వెనుక ఉన్న మెట్లు లేని బావిలో కాలుజారి పడ్డారు. 60 అడుగుల లోతైన ఆ బావిలో 12 అడుగుల నీరుంది. ఈదుకుంటూ కొంతసేపటి తర్వాత చెట్ల వేర్లను పట్టుకుని నీటిపైకి చేరుకున్నాడు. ఎవరైనా కాపాడాలంటూ గట్టిగా అరిచాడు.

అటువైపు ఎవరూ రాకపోవడంతో అతని గోడు ఎవరికీ తెలియలేదు. గురువారం రాత్రంతా బావిలోనే గడిపాడు. శుక్రవారం ఉదయం పశువులు మేపడానికి జీవన్‌ అనే యువకుడు వెళ్లాడు. బావిలోంచి అరుపులు రావడంతో వెళ్లి చూసిన జీవన్‌కుమార్‌కు చంద్రశేఖర్‌ కనిపించాడు. అగ్ని మాపక సిబ్బంది తాడు సాయంతో చంద్రశేఖర్‌ను బావిలోంచి బయటకు లాగారు. తాను ప్రాణాలతో బయటపడాతానని అనుకోలేదన్న చంద్రశేఖర్‌.. తనను కాపాడిన జీవన్‌కుమార్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

>
మరిన్ని వార్తలు