ఇద్దరు బాలికలను బంధించిన యువకుడు.. మాయమాటలు చెప్పి!

6 Jan, 2023 20:17 IST|Sakshi
యువకుడి ఇంటి ముందు గుంపుగా జనాలు

సాక్షి, భువనగిరి: ఇద్దరు బాలికలను ఓ యువకుడు తన ఇంట్లో బంధించి భయభ్రాంతులకు గురి చేశాడు. ఈ సంఘటన యాదాద్రి జిల్లా భువనగిరి మండల పరిధిలోని బీఎన్‌ తిమ్మాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీఎన్‌ తిమ్మాపురం గ్రామానికి చెందిన మేడబోయిన యాకేష్‌ తల్లిదండ్రులు పని నిమిత్తం ఉదయం హైదరాబాద్‌కు వెళ్లారు. అదే గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 9, 10వ తరగతి చదువుతున్నారు.

పాఠశాలకు వెళ్లిన ఆ ఇద్దరు బాలికలు మధ్యాహ్నం తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో వారికి మాయమాటలు చెప్పిన యాకేష్‌ తన ఇంటి ముందు నుంచి తాళం వేసి వెనుక వైపు నుంచి ఇంట్లోకి తీసుకెళ్లాడు. కాగా సాయంత్రం వరకు బాలికలు ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు గ్రామంలో వెతికారు. మధ్యాహ్నం బాలికలు యాకేష్‌ ఇంటికి వెళ్లినట్లు తెలుసుకున్న కుటుంబ సభ్యులు తాళం వేసి ఉన్న ఇంటి వెనుకకు వెళ్లి చూడగా లోపలి నుంచి గడియ పెట్టి ఉండటం గుర్తించారు.

దీంతో ఇంటి కిటికి అద్దాలను ధ్వంసం చేయగా బాలికలు అందులో ఉండడం చూసి కోపోద్రిక్తులై ఇంటి ఆవరణలో ఉన్న  రెండు బైక్‌లకు నిప్పు పెట్టారు. ఇది గమనించిన యాకేష్‌ ఇద్దరు బాలికలను బయటకు పంపి తాను లోపలే ఉన్నాడు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకునే సమయానికి గ్రామస్తులు యాకేష్‌ ఇంటి ఎదుట పెద్దఎత్తున గూమిగూడారు. ఈ క్రమంలో యాకేష్‌పై గ్రామస్తులు దాడి చేసేందుకు యత్నించగా పోలీసులు లాఠీచార్జి చేసి  అక్కడ ఉన్న వారిని చెదరగొట్టారు. యువకుడిని పోలీస్‌ స్టేషన్‌కు తరలించే క్రమంలో కొంతమంది రాళ్లు విసరడంతో పోలీసు వాహనం అద్దాలు పగిలాయి. ఒక పోలీస్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

ఇద్దరు విద్యార్థినులను పోలీస్‌ స్టేషన్‌కు తరలించి మహిళా పోలీసులతో విచారణ నిర్వహిస్తామని భువనగిరి రూరల్‌ సీఐ వెంకటేశం పేర్కొన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు  ఇచ్చిన ఫిర్యాదు మేరకు యువకుడిపై పోక్సో కేసు నమోదు చేస్తామని రూరల్‌ ఎస్‌ఐ రాఘవేందర్‌గౌడ్‌ చెప్పారు. అగ్నిమాపక సిబ్బంది వచ్చి దగ్ధమవుతున్న బైక్‌లను ఆర్పేశారు. 

మరిన్ని వార్తలు