దారుణం: భార్యకు కరోనా.. గుండెపోటుతో భర్త మృతి

1 Sep, 2020 09:33 IST|Sakshi

సాక్షి, మల్లాపూర్‌(కోరుట్ల): కరోనా విజృంభణ మానవ సంబంధాలను ప్రశ్నార్థకం చేస్తోంది.. వైరస్‌ సోకిన వారికి అండగా నిలిచి, మనోధైర్యం నింపాల్సిన బంధువులు, మిత్రులు, స్థానికులు భయపడుతూ దగ్గరకు రావడం లేదు.. దీంతో కొంతమంది మానసిక వేదనతో కృంగిపోతూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. మరికొందరు సమాజం నుంచి వెలివేయబడ్డామనే ఆందోళనతో మనోధైర్యాన్ని కోల్పోతున్నారు.. పలువురు అదే పనిగా ఆలోచిస్తూ గుండెపోటుతో చనిపోతున్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని సంస్థలు, కొంతమంది వ్యక్తులు మేమున్నాం.. అంటూ ముందుకు వస్తూ మాయమవుతున్న మానవత్వానికి పునర్జీవం పోస్తున్నారు.. ఇందుకు మల్లాపూర్‌ మండలంలోని రాఘవపేటలో జరిగిన ఘటనే సాక్ష్యం. స్థానికుల కథనం ప్రకారం.. రాఘవపేటకు చెందిన బెజ్జారపు పరమానందం(55)కు ఇద్దరు భార్యలు. రెండో భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. తన ఇల్లాలికి వైరస్‌ రావడంతో ఆయన తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. ఈ క్రమంలో సోమవారం గుండెపోటుతో మృతిచెందాడు.

పరమానందం అంత్యక్రియలు చేయడానికి బంధువులు, చుట్టుపక్కలవారు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఆయన భార్య తల్లడిల్లింది. సర్పంచ్‌ నత్తి లావణ్య, ఉపసర్పంచ్‌ ఎండీ.అమీనొద్దీన్, తహసీల్దార్‌ రమేష్‌లు ఈ విషయాన్ని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన కోరుట్లకు చెందిన ఆల్‌ ఇండియా మానవత్వ సందేశ సమితి సభ్యులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంస్థ సభ్యులు నజీర్‌ అలీ, ఇసాక్‌ అబ్దుల్లా, సుష్యాల్, హఫీజ్, అబ్దుల్‌ రబ్‌లు ప్రత్యేక అంబులెన్స్‌లో రాఘవపేటకు చేరుకున్నారు. పీపీ కిట్లు ధరించి, పరమానందం మృతదేహాన్ని గ్రామ శివారులోని శ్మశానవాటికకు తీసుకెళ్లి, అంత్యక్రియలు నిర్వహించారు. మానవత్వాన్ని చాటుకున్న ఆ సమితి సభ్యులకు బాధిత కుటుంబ సభ్యులు, ఆ గ్రామ ప్రజాప్రతినిధులు, నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. కాగా మృతుడికి ఒక కుమారుడు ఉన్నాడు.

 

మరిన్ని వార్తలు