-

అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో డ్రామా!

27 Feb, 2023 07:51 IST|Sakshi

సాక్షి, మియాపూర్‌: బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఓ యువకుడు అందుకోసం చేసిన అప్పులు తీర్చుకునేందుకు ప్రియురాలితో కలిసి కిడ్నాప్‌ డ్రామా ఆడి పోలీసులకు పట్టుబడిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఆదివారం వెలుగులోకి వచి్చంది. సీఐ తిరుపతిరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వరంగల్‌ జిల్లాకు చెందిన సంజీవరావు, అంకమ్మ దంపతులు 25 ఏళ్ల క్రితం నగరానికి వలస వచ్చి మియాపూర్‌లోని హెచ్‌ఎంటీ స్వర్ణపురి కాలనీలో నివాసముంటున్నారు.

వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు. సంజీవరావు స్థానికంగా సెంట్రింగ్‌ పనులు చేసేవాడు. అతని చిన్న కుమారుడు పవన్‌ బీటెక్‌ నాల్గో సంవత్సరం చదువుతున్నాడు. శనివారం సాయంత్రం ఇంటి నుంచి బయటికి వెళ్లిన పవన్‌ తిరిగి రాలేదు. ఆందోళనకు గురైన అతడి తండ్రి సంజీవరావు మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే సమయంలో పవన్‌ తల్లి అంకమ్మకు గుర్తుతెలియని మహిళ ఫోన్‌ చేసి మీ కుమారుడు పవన్‌ నా దగ్గరే ఉన్నాడని, రూ.50వేలు ఇచ్చి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేసింది.

డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తానని బెదిరించింది. ఈ విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లడంతో సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా ముందుకెళ్లిన దర్యాప్తు బృందం ఆదివారం మధ్యాహ్నం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో ఉన్నట్లు గుర్తించి అక్కడికి వెళ్లి పవన్‌తో పాటు గుర్తుతెలియని మహిళను అదుపులోకి తీసుకుని పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. వారిని విచారించగా అసలు విషయం వెల్లడించారు 

బస్టాప్‌లో పరిచయంతో.. 
మూడు నెలల క్రితం కూకట్‌పల్లికి చెందిన కలిబింది వరలక్ష్మితో కూకట్‌పల్లి బస్‌స్టాప్‌లో పవన్‌కు పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో వారిరువురు ప్రతిరోజూ కలుసుకునే వారు. బెట్టింగ్‌లు, చెడు వ్యసనాలకు అలవాటు పడిన పవన్‌ పలువురి వద్ద అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు వరలక్ష్మి వద్ద రూ. 30వేలు అప్పుగా తీసుకున్నాడు. వారం రోజుల క్రితం డబ్బులు తిరిగి ఇవ్వాలని వరలక్ష్మి అతడిపై ఒత్తిడి తెచ్చింది.

దీంతో ఇంట్లో డబ్బులు ఇవ్వరని భావించిన పవన్‌ ఆమెతో కలిసి కిడ్నాప్‌ డ్రామాకు పథకం వేశాడు. ఈ క్రమంలో శనివారం ఇంట్లో నుంచి బయటికి వెళ్లిన పవన్‌ వరలక్ష్మీని కలిశాడు. ఇద్దరు కలిసి పలు ప్రాంతాల్లో తిరిగారు. పథకంలో భాగంగా వరలక్ష్మి పవన్‌ తల్లికి ఫోన్‌ చేసి రూ.50వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అయితే సెల్‌ఫోన్‌ సిగ్నల్‌ ఆధారంగా నిందితులను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  

(చదవండి: భార్యపై చేయి చేసుకున్నానని.. ఆవేదనతో భర్త..)

మరిన్ని వార్తలు