దొంగచాటుగా మహిళల ఫొటోలు తీసి.. ట్విటర్‌లో పెట్టి.. ఇప్పటి వరకు 400 మందివి

31 Aug, 2022 13:58 IST|Sakshi

సాక్షి,  జగిత్యాల జిల్లా: అతడో వాటర్‌ బబుల్‌ బాయ్‌.. మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తూ.. అదను చూసి దొంగచాటుగా మహిళల ఫొటోలు చిత్రీకరించాడు.. ఓ మహిళ పేరిట ట్విటర్‌ ఖాతా తెరిచాడు.. సుమారు 400 ఫొటోలను అందులో అప్‌లోడ్‌ చేశాడు.. విషయం తెలిసిన బాధితులు లబోదిబోమంటున్నారు. వివరాలు.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి నల్ల రవి(34) మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ ఏర్పాటు చేసుకున్నాడు. ఎకీన్‌పూర్, సంగెం గ్రామాల్లో ఇంటింటా తిరుగుతూ వాటర్‌ బబుల్స్‌ సరఫరా చేస్తున్నాడు.

ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉండే మహిళల ఫొటోలను మొబైల్‌ ఫోన్‌లో దొంగచాటుగా చిత్రీకరించాడు. సుమారు ఏడాదిగా దాదాపు 400 మంది మహిళలను ఫొటోలు తీసినట్లు సమాచారం. ఇలా తీసిన ఫొటోలను మంగళవారం ఉమ పేరిట ట్విటర్‌ ఖాతా తెరిచి అందులో అప్‌లోడ్‌ చేశాడు. వీటిని చూసిన సంగెం గ్రామస్తులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు.

ఆ వెంటనే కోరుట్ల పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు. విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. యువకుడి ఆచూకీ కోసం ఎస్సై సతీశ్‌కుమార్‌ ప్రయత్నించగా మొబైల్‌ ఫోన్‌స్విచ్‌ ఆఫ్‌ వచ్చింది. ఆరా తీయగా ఇంట్లో కూడా లేడని తెలిసింది. అయితే, ట్విటర్‌లోని ఫొటోలు వెంటనే తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు. అయితే, ఈ ఫొటోలు అశ్లీలంగా లేవని తెలిసింది.  

మరిన్ని వార్తలు