ఏం జరిగిందని ప్రశ్నించారని..పోలీసులపైకి గన్‌ గురిపెట్టి...

10 Nov, 2022 08:29 IST|Sakshi
పోలీసులకు రివార్డు ఇస్తున్న నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌

సాక్షి, పంజాగుట్ట: పోలీసులపైకి గన్‌ చూపించిన వ్యక్తిని పంజగుట్ట పోలీసులు అరెస్టు చేసి అతని వద్ద నుంచి లైసెన్స్‌డ్‌ గన్, ఆరు రౌండ్ల బుల్లెట్‌లు స్వా«దీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...చిత్తూరు జిల్లాకు చెందిన వెంకట నాగేంద్ర రెడ్డి రిటైర్డ్‌ ఆర్మీ ఉద్యోగి. ప్రస్తుతం జీడిమెట్లలో ఉంటూ ఓ ప్రైవేట్‌ సంస్థలో సెక్యూరిటీ ఇన్‌చార్జిగా విధులు నిర్వహిస్తున్నాడు.

బుధవారం తెల్లవారు జామున 3:30 ప్రాంతంలో అమీర్‌పేట బిగ్‌బజార్‌ వీధిలో ట్రాన్స్‌జెండర్స్‌తో గొడవ పడుతున్నాడు. గమనించిన పెట్రోలింగ్‌లో ఉన్న కానిస్టేబుల్‌ సాయికుమార్, హోంగార్డు రవీంద్రబాబులు  వెళ్లి సమస్య ఏమిటని ప్రశ్నించారు. దీంతో వెంకట నాగేంద్ర రెడ్డి తనవద్ద ఉన్న గన్‌ను పోలీసులకు గురిపెట్టాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు చాకచక్యంగా అతడ్ని పట్టుకుని స్టేషన్‌కు తరలించారు.

అతని వద్ద ఉన్న గన్, ఆరు రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. గన్‌ లైసెన్స్‌ ఉన్నప్పటికీ దాని గడువు అయిపోయినట్లు తెలుస్తుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గన్‌ గురిచూపినా బెదరకుండా చాకచక్యంగా పట్టుకున్న కానిస్టేబుల్‌ సాయికుమార్, హోం గార్డు రవీంద్రబాబులను నగర పోలీస్‌ కమిషనర్‌ సి.వి.ఆనంద్‌ అభినందించారు. వారికి ఒక్కొక్కరికీ 2500 క్యాష్‌ రివార్డు, జ్ఞాపికను అందించారు.  

(చదవండి: ‘డర్టీ పిక్చర్‌’లో కొత్త కోణం! మహిళ ప్రమేయం లేకుండానే ఫొటో వైరల్‌ )

మరిన్ని వార్తలు