పర్యాటక ప్రాంతంగా మానేరు రివర్‌ఫ్రంట్‌ 

7 Nov, 2021 01:56 IST|Sakshi
డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై సమీక్షిస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌  

సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో వేగంగా పనులు

ఇరిగేషన్, టూరిజం ఉన్నతాధికారులతో మంత్రి గంగుల సమీక్ష   

సాక్షి, హైదరాబాద్‌: కరీంనగర్‌ మానేరు రివర్‌ ఫ్రంట్‌ను దేశానికే ఆదర్శంగా, అద్భుత పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో ప్రాజెక్టు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం హైదరాబాద్‌ జలసౌధలో టూరిజం, ఇరిగేషన్, రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులతో డీపీఆర్‌ ఫైనలైజేషన్, రిటైనింగ్‌ వాల్‌ తుది డిజైన్లు, భూసేకరణ తదితర అంశాలపై మంత్రి గంగుల కమలాకర్‌ సమీక్ష నిర్వహించారు.

మొత్తం 15 కిలోమీటర్లు ప్రతిపాదించిన మానేరు రివర్‌ ఫ్రంట్‌లో తొలి విడతగా 4 కి.మీ మేర నిర్మాణాలు చేపట్టనున్నారు. సర్వే ఏజెన్సీ అందజేసిన డిజైన్లను పరిశీలించిన అనంతరం, ఈ ప్రతిపాదనలపై ఐ అండ్‌ క్యాడ్‌ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలతో పాటు మిగతా డిజైన్‌ పనులను పూర్తి చేయాలని మంత్రి గంగుల అధికారులను ఆదేశించారు.

రోజువారీ పనుల్లో వేగం పెంచేందుకు ఏజెన్సీ ప్రతినిధులతో పాటు ఇరిగేషన్, టూరిజం అధికారులతో బృందాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్‌ నెలాఖరులోగా పూర్తి స్థాయి డిజైన్లు రూపొందించాలని, టెండర్ల ప్రక్రియ చేపట్టి పనులు మొదలుపెట్టాలని మంత్రి సూచించారు. కార్యక్రమంలో ఇరిగేషన్‌ ఈఎన్సీలు మురళీధర్, శంకర్, టూరిజం శాఖ ఈడీ శంకర్‌రెడ్డి, టీఎస్‌టీడీసీ సీఈ వెంకటరమణ, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శివకుమార్, కరీంనగర్‌ ఆర్డీవో ఆనంద్‌ కుమార్, ఐఎన్‌ఐ కన్సల్టెన్సీ డైరెక్టర్‌ హరీశ్‌ గోయల్, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు