అన్నార్తుల ఆకలి తీర్చడమే ‘మావన సేవా’ సంకల్పం... 

30 May, 2021 10:59 IST|Sakshi

మానవ సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆహార వితరణ

లాక్‌డౌన్‌ వేళలో మరింత విస్తృతంనిత్యం 500 మందికి అన్నదానంమానవత్వాన్ని చాటుతున్న దాతలు

సనత్‌నగర్‌(హైదరాబాద్‌): మానవ సేవా సమితి ఆధ్వర్యంలో నిత్యాన్నదాన కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతియేటా వేసవికాలం వచ్చిందంటే ఈ సంస్థ ఆధ్వర్యంలో రెండు నెలల పాటు బాటసారుల ఆకలి తీరుస్తుంటారు. అయితే గత రెండు పర్యాయాలుగా కరోనా మహమ్మారి వ్యాప్తి దృష్ట్యా లాక్‌డౌన్‌ వేళ.. ప్రతిరోజూ అభాగ్యులకు, నిరుపేదలకు ఆహారం అందించడమే పనిగా పెట్టుకున్నారు. 

ప్రతియేటా ఈ సేవా యజ్ఞానికి వేదికగా నిలిచే మోడల్‌కాలనీ కమాన్‌ వద్దనే ఆహారాన్ని తీసుకువచ్చి వడ్డించే వారు. అయితే ప్రస్తుతం నెలకొన్న లాక్‌డౌన్‌ పరిస్థితుల్లో ఆహారాన్ని ప్యాకింగ్‌ చేయించి భౌతిక దూరం పాటింపజేస్తూ వాటిని అందజేస్తున్నారు. 

కాలనీ కమాన్‌ వద్ద మిత ఆహార సేవా వితరణ కేంద్రం వద్ద పంపిణీతో పాటు యూసుఫ్‌గూడ, కృష్ణానగర్, సనత్‌నగర్‌ స్వామి టాకీస్‌ ప్రాంతాల్లోని రోజువారీ కూలీలకు సైతం ఆహారాన్ని అందిస్తూ లాక్‌డౌన్‌లో వారి ఆకలిని తీరుస్తున్నారు. 

ఈ బృహత్తర కార్యక్రమానికి దాతలు తమ సహకారం అందిస్తూ మానవత్వానికి ప్రతిరూపంగా నిలుస్తున్నారు. ఈ సేవల ద్వారా లాక్‌డౌన్‌ సమయంలో వందలాది మంది అన్నార్తుల ఆకలి దప్పికలను తీరుస్తున్నారు. రోజువారీ మెనూగా ఒకరోజు వెజ్‌ బిర్యానీ, మరో రోజు పులిహోరా, ఇంకోరోజు టమాట రైస్‌.. ఇలా ఏదో ఒక రైస్‌కు తోడుగా మజ్జిగ ప్యాకెట్, అరటి పండు, మంచినీళ్ల ప్యాకెట్‌ అందిస్తున్నారు. రోజుకు 500 మందికి ఆకలి, దప్పికలను తీర్చే లక్ష్యంగా వంటకాలను తయారుచేస్తున్నారు. ఇది కాకుండా ప్రత్యేక సందర్భాల్లో దాతలు ఇచ్చే డొనేషన్‌ ఆధారంగా మరింత మంది ఆకలి తీరుస్తున్నారు. 

మానవత్వంతో దాతలు ముందుకు.. 
మానవ సేవా సమితి చారిటబుల్‌ ట్రస్ట్‌ చేపట్టిన సేవా సంకల్పానికి దాతలు తాము సైతం ముందుకువచ్చారు. మోడల్‌ కాలనీ అధ్యక్షుడు సారిపల్లి కొండల్‌రావుతో పాటు చాలామంది దాతలు ముందుకువచ్చి తమ సేవానిరతిని చాటుతున్నారు. దాతలు తమ పేర్లపై అన్నార్తుల ఆకలిని తీర్చేందుకు అయ్యే ఖర్చును ట్రస్ట్‌ నిర్వాహకులకు అందిస్తారు. కేంద్రం ప్రతినిధులు ప్రత్యేకంగా ఆహార పదార్థాలను ప్యాకింగ్‌ చేయించి దాతల పేర్లను నోటీసు బోర్డుపై రాస్తారు. కేవలం ఒక్క వేసవి, లాక్‌డౌన్‌ వేళలకే ట్రస్ట్‌ సేవలను పరిమితం చేయకుండా సందర్భాన్ని బట్టి ఏడాది పొడవునా కొనసాగిస్తున్నారు. ఎక్కువగా ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయంలో ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్న రోగులతో పాటు వారి సంబం«దీకులు, సహాయకులకు కూడా అన్నదానం చేస్తుంటారు. దాతలు కేవలం వంటకాలకు అయ్యే ఖర్చును మాత్రం ఇస్తే... ట్రస్ట్‌ సభ్యులు ఆయా వంటకాలను తయారు చేయడమే కాకుండా వాటిని ప్యాకింగ్‌ చేయించి పంపిణీ చేస్తున్నారు. ట్రస్ట్‌ సభ్యులు డి.బాబుబుచ్చిబాబు, జేఎస్‌టీ శాయి, మాచారావు, రవీంద్రబాబు, శశికాంత్‌ పాటు మరికొంతమంది ఈ సేవలను కొనసాగిస్తున్నారు. 

 దాతల స్పందన అపూర్వం 
ట్రస్ట్‌ తరుఫున చేపట్టే సేవా కార్యక్రమాలకు దాతలు స్వచ్ఛందంగా ముందుకువస్తున్నారు. తాము చేట్టిన యజ్ఞంలో తలోచేయి వేసి నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ‘అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న’ అన్న సూక్తిని ప్రతిఒక్కరిలో రగిల్చి సేవా దృక్పథాన్ని అలవర్చడం శుభపరిణామం. ఇదే రీతిలో సేవలను విస్తృతం చేస్తాం. తమ సంకల్పానికి మద్దతుగా నిలుస్తోన్న దాతలకు కృతజ్ఞతలు. 
– జేఎస్‌టీ శాయి, ట్రస్ట్‌ సభ్యుడు

నిరంతరాయంగా కొనసాగిస్తాం 
మానవ సేవా సమితి చారిటబుల్‌ ట్రస్ట్‌ సేవలను దాతల సహకారంతో ఏడాది పొడవునా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే వారంలో 3 నుంచి 4 రోజులు మానసిక చికిత్సాలయంలోని రోగుల సహాయకులు, వారి సంబందీకులకు అన్నదానం చేస్తున్నాం. ప్రస్తుతం లాక్‌డౌన్‌ ఉన్న దృష్ట్యా వలస కూలీలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో యూసుఫ్‌గూడ, కృష్ణానగర్‌ ప్రాంతంలో ప్రతిరోజూ ఆహార ప్యాకెట్లను అందిస్తున్నాం. దీంతో పాటు మోడల్‌కాలనీ కమాన్‌ వద్ద ఆహార పంపిణీ కేంద్రం వద్ద కూడా ప్రతిరోజూ అన్నదాన కార్యక్రమం కొనసాగుతుంది. 
– బుబ్చిబాబు, ట్రస్ట్‌ సభ్యుడు

మరిన్ని వార్తలు