భోజనం తినాలంటే భయమేస్తోంది

5 Jan, 2023 03:43 IST|Sakshi
ధర్నా చేస్తున్న విద్యార్థినులు 

పురుగులు, రాళ్లు వస్తున్నాయంటూ కేజీబీవీ విద్యార్థినుల ధర్నా

విద్యార్థినులు, టీచర్‌ను గదిలో నిర్బంధించిన ఎస్‌ఓ 

డీఈవో విచారణ.. ఎస్‌ఓ సస్పెన్షన్‌ 

నెన్నెల: మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థినులు బుధవారం ఆందోళనకు దిగారు. ప్రతిరోజూ భోజనంలో పురుగులు, రాళ్లు వస్తున్నాయని, ఆ తిండి తినలేక అర్ధాకలితో అలమటిస్తున్నామంటూ ఉదయం అల్పాహారాన్ని బహిష్కరించి విద్యాలయం ఆవరణలో ధర్నా చేపట్టారు. విద్యార్థినులు రోడ్డుపైకి వెళ్లి బైఠాయించేందుకు ప్రయత్నించగా స్పెషల్‌ ఆఫీసర్‌ (ఎస్‌ఓ) అమూల్య వారిని అడ్డుకుని గేటుకు తాళం వేశారు.

విషయం తెలుసుకున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, డీఈవో వెంకటేశ్వర్లు, ఎంఈవో మహేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ రమాదేవి, ఎస్సై రాజశేఖర్‌ పాఠశాలకు చేరుకుని మూసిఉన్న మెయిన్‌ గేట్‌ను తెరిపించి లోపలికి వెళ్లారు. మెనూ ప్రకారం భోజనం వడ్డించకుండా నిత్యం కిచిడీ, టమాటా, నీళ్ల పప్పు, చాలీచాలని అన్నం పెడుతున్నారని విద్యార్థినులు రోదించారు.

టిఫిన్‌ బాగుండడం లేదని ఎస్‌ఓకు చెబితే ‘ఇంటివద్ద టిఫిన్‌ తింటారా’ అంటూ తీవ్ర పదజాలంతో దూషిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. సీనియర్‌ టీచర్‌ పద్మ నుంచి సెల్‌ఫోన్‌ లాక్కొని తామందరినీ గదిలో నిర్బంధించారని సిబ్బంది పేర్కొన్నారు. దీంతో ఎస్‌ఓ అమూల్యపై డీఈవో ఆగ్రహం వ్యక్తం చేశారు. కన్నెపల్లిలో ఇలానే ప్రవర్తించడంతో సస్పెన్షన్‌ వేటు పడిందని, మానవతా దృక్పథంతో నెన్నెలకు పంపిస్తే ఇక్కడా అదే పద్ధతి అయితే ఎలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్‌ఓను సస్పెండ్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తూ, కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు