తాట తీసేందుకు కొత్త సెక్షన్‌

18 Jan, 2021 09:49 IST|Sakshi

రోడ్డు ప్రమాదంలో మృతికి కారణమైతే పదేళ్ల జైలు  

రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌లో 10 కేసులు నమోదు

ప్రమాదాల నివారణే లక్ష్యం

త్వరలో రాష్ట్రమంతా అమలు చేసే యోచన

సెక్షన్‌ 304(2) అమలుకు నిర్ణయం

మంచిర్యాలక్రైం: రోడ్డు ప్రమాదాల  నివారణకు రాష్ట్ర పోలీస్‌ శాఖ ఇదివరకే అనేక రకాల ప్రయోగాలు చేపట్టింది. ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై ఇప్పటికే కొరడా ఝలిపిస్తోంది. తరచూ ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి బ్లాక్‌ స్పాట్‌లను ఏర్పాటు చేశారు. దీనిపై పూర్తిగా శాస్త్రీయ అధ్యయనం చేసి ప్రమాద స్థలాల వద్దకు రాగానే డ్రైవర్‌కు ఇండికేషన్‌ వచ్చే విధంగా గూగుల్‌ మ్యాప్స్‌ ద్వారా శ్రీకారం చుట్టారు. అయినా రోడ్డు ప్రమాదాల సంఖ్య తగ్గుముఖం పట్టకపోవడం, ప్రమాదాల్లో రోజురోజుకూ మృతుల సంఖ్య పెరగడంతో ఈ సారి రోడ్డుప్రమాదాలపై కఠినంగా వ్యవహరించేందుకు  సిద్ధమైంది. ఈ కఠిన విధానాన్ని ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌ నగరంలో అమలు చేస్తున్నారు. 2016 జూలై 1న హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో అభం, శుభం తెలియని తొమ్మిదేళ్ల బాలిక మృతి చెందడంతో మొదటిసారి రోడ్డు ప్రమాదాలపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించారు. 

ఏమిటా కఠినాస్త్రం
ఇకపై నుంచి ఎవరైనా వాహనదారులు నిర్లక్ష్యంగా వాహనం నడిపి ఎదుటి వారి మరణానికి కారణమైతే వారిపై ఇకనుంచి ఐపీసీ 304(2) సెక్షన్‌ కింద కేసు నమోదు చేయనున్నారు. ఈ సెక్షన్‌ కింద కేసు నమోదైతే 10సంవత్సరాల పాటు జైలు శిక్ష పడే అవకాశముంది. ఈ సెక్షన్‌ను మర్డర్‌ కేసులకు ఉపయోగిస్తారు. ప్రస్తుతం ఈ చట్టం ద్వారా హైదరాబాద్‌లో మాత్రమే కేసులు నమోదు చేస్తున్నారు. 2016లో తొలి కేసు నమోదైనప్పటి నుంచి హైదరాబాద్‌ వాహనదారుల్లో గుబులు మొదలైంది. ఈ చట్టం కొంత మేర సత్ఫలితాలను  ఇవ్వడంతో ఈ ఏడాదిలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు పోలీస్‌శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపెల్లి జిల్లాలో ఐపీసీ 304(2) కింద 10 కేసులు నమోదు చేసినట్లు సీపీ సత్యనారాయణ తెలిపారు.

వస్తామో రామో తెలియని పరిస్థితి
కొత్త జిల్లాలు ఏర్పడ్డ తర్వాత ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. మరో పక్క వాహనాల సంఖ్య సైతం రోజురోజుకూ పెరుగుతోంది. వాహనంపై బయటకెళ్తే క్షేమంగా ఇంటికి తిరిగి వస్తామో రామో తెలియని పరిస్థితి నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకున్న డీజీపీ మహేందర్‌ రెడ్డి వాహనాలను నిర్లక్ష్యంగా నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యేవారిపై కఠినంగా వ్యవహరించాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. రాంగ్‌ రూట్‌లో వెళ్లడం, డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేకుండా వాహనం నడపడం, సెల్‌ ఫోన్‌ డ్రైవింగ్, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్, మైనర్లు వాహనాలు నడపడం వల్లే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని వీటిపై కఠినంగా వ్యవహరించాలని యోచిస్తున్నారు. 

తప్పు చేశామో.. పదేళ్లపాటు జైలుకే
ఇప్పటివరకు పోలీసులు ట్రాఫిక్‌ ఉల్లంఘనులపై కేసులు నమోదు చేస్తూ ఈ–చలాన్‌ ద్వారా జరిమానాలు విధిస్తున్నారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసుల్లో న్యాయస్థానం ఒకటి, రెండు, మూడు రోజులు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ తీర్పులు వెలువరిస్తోంది. ఈ విధానం వాహనదారులకు పరిపాటిగా మారింది. ప్రస్తుతం పోలీస్‌శాఖ తీసుకున్న కొత్త నిర్ణయం ప్రకారం ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడుతూ రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతికి కారణమైన వారిపై పోలీసులు ఈ సెక్షన్‌ కింద కేసులు నమోదు చేయనున్నారు. 

నిర్లక్ష్యంతో ప్రాణాలు పోతున్నాయి
వాహనాదారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. రోడ్డు ప్రమాదాల నివారణకు రామగుండం పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని మంచిర్యాల, పెద్దపెల్లి జిల్లాల్లో అన్ని విధాలా చర్యలు తీసుకుంటున్నాం. గతంలో ప్రమాద స్థలాలను గుర్తించి బ్లాక్‌ స్పాట్‌లను ఏర్పాటు చేశాం. అయినప్పటికీ ప్రమాదాలు జరుగుతుండటం బాధాకరం. ఇప్పటికే కమిషనరేట్‌ పరి«ధిలో ఐపీసీ304(2) సెక్షన్‌ కింద 10 కేసులు నమోదు చేశాం.

– సత్యనారాయణ, రామగుండం పోలీస్‌ కమిషనర్‌

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు