Manchu Lakshmi: పోలీసులకు ‘మంచు’ లంచ్‌

21 May, 2021 03:25 IST|Sakshi

లాక్‌డౌన్‌ విధుల్లో ఉన్న పోలీసులకు మంచు లక్ష్మి భోజనం సరఫరా

కరోనా రోగులకు సాయం చేస్తున్న రేణుదేశాయ్‌  

బంజారాహిల్స్‌ (హైదరాబాద్‌): లాక్‌డౌన్‌ సమయంలో రాత్రింబవళ్లు కష్టపడుతున్న పోలీసులకు తనవంతు సాయం చేసేందుకు ప్రముఖ సినీనటి మంచు లక్ష్మి ముందుకు వచ్చారు. ఫిలింనగర్‌లోని సీవీఆర్‌ న్యూస్‌ చౌరస్తా చెక్‌పోస్ట్‌ వద్ద విధులు నిర్వహిస్తున్న జూబ్లీహిల్స్‌ పోలీసులు మధ్యాహ్న భోజనానికి ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో మంచు లక్ష్మి వారంరోజుల నుంచి లాక్‌డౌన్‌ విధులు నిర్వహిస్తున్న 50 మంది పోలీసులకు లంచ్‌ పంపిస్తున్నారు.

ఇంట్లో వంట మనిషితో 50 మందికి సరిపడా భోజనాన్ని తయారు చేసించి తన సిబ్బంది ద్వారా పంపిస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. ఇక్కడ లా అండ్‌ ఆర్డర్‌ పోలీసులతోపాటు, ట్రాఫిక్‌ పోలీసులు మంచు లక్ష్మి పంపించిన భోజనాన్ని తింటున్నారు.


డ్యాన్సర్ల కోసం కదిలిన దంపతులు.. 
సినిమా, ఈవెంట్, ఇతర షోలలో పనిచేసే సుమారు వందమంది డ్యాన్సర్లకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసేందుకు డ్యాన్స్‌ మాస్టర్‌ ఆట సందీప్‌తో పాటు ఆయన భార్య జ్యోతిరాజ్‌ ముందుకు వచ్చారు. వీరిద్దరు కలసి నిధుల సేకరణకు నడుం బిగించారు. ప్రముఖ కొరియోగ్రాఫర్‌ శేఖర్‌ మాస్టర్‌ ఈ ప్రయత్నంలో తమకు సాయం చేయడమేకాక సంపూర్ణ మద్దతు ఇచ్చారని ఈ సందర్భంగా వారు తెలిపారు.     

కరోనా రోగుల కోసం రేణుదేశాయ్‌.. 
సినీనటి రేణుదేశాయ్‌ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలసి కరోనా రోగులకు తనవంతు సాయం చేస్తున్నారు. ఆక్సిజన్‌ సిలిండర్లు, ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ బెడ్లు, కరోనా రోగులకు ఆహారం, మందులు తదితర అవసరాల కోసం ఆమెకు ఇన్‌స్ట్రాగ్రామ్‌లో వివరాలు పంపిస్తే సహాయం చేస్తున్నారు.

రోగి పేరు, ఆస్పత్రి పేరు, ఏ నగరం, ఎలాంటి సాయం కావాలో తెలుపుతూ ఫోన్‌ నంబర్లు పంపిస్తే చాలు.. ఆమె హైదరాబాద్, బెంగళూరు, చెన్నైనగరాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తనవంతు సాయం అందిస్తున్నారు. గురువారం ఒక్కరోజే ఆమెకు 200 వినతులు వచ్చాయి. వాటన్నింటినీ పరిశీలించి ఎవరికి ఏం అవసరమో వాటిని జాబితా రూపొందించి సంబంధిత ఎన్జీవోలకు పంపిస్తుంటానని.. ఆయా సంస్థలవారు బాధితులకు సాయం అందజేస్తారని ఆమె తెలిపారు.   

మరిన్ని వార్తలు