Mandi Recipe In Telugu: ఒక్క ప్లేట్‌ నలుగురికి సరిపోద్ది.. అరబిక్‌ భాషలో మండీ, మతామ్‌ అంటే తెలుసా?

3 Nov, 2021 10:24 IST|Sakshi
కలిసి కట్టుగా మండీ బిర్యానీ ఆరగిస్తున్న భోజన ప్రియులు

 ఆసక్తి చూపుతున్న యువత

నగర శివార్లలో భారీగా వెలుస్తున్న హోటళ్లు

సాక్షి, పహాడీషరీఫ్‌: నగర వాసులను నోరూరిస్తోంది మండీ బిర్యానీ. ఇన్నాళ్లు హైదరాబాద్‌ బిర్యానీ రుచిని ఆస్వాదించిన ప్రజలు ఇప్పుడు అరబ్‌ వంటకమైన మండీ బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. ముఖ్యంగా యువత  ఈ బిర్యానీని ఆరగించేందుకు ఆసక్తి చూపుతున్నారు. జల్‌పల్లి, ఎర్రకుంట, షాయిన్‌నగర్, పహాడీషరీఫ్‌ ప్రధాన రహదారికి ఇరువైపులా ఈ మండీ హోటల్స్‌(మతామ్‌) పెద్ద ఎత్తున వెలుస్తున్నాయి. అరబిక్‌ భాషలో మండీ అంటే బిర్యానీ అని, మతామ్‌ అంటే హోటల్‌ అని అర్థం. ధరలు సాధారణ బిర్యానీలకు కాస్త అటూ ఇటు గానే ఉంటున్నాయి. ఒక్క ప్లేట్‌లో నలుగురు సంపూర్ణంగా తినవచ్చు. 
చదవండి: మూలుగుబొక్క బిర్యానీ..నగరంలో ఇప్పుడిదే ట్రెండ్‌ !

పౌష్టిక విలువలు పుష్కలం 
మండీ బిర్యానీ పూర్తిగా పోషక విలువలు కలిగిన ఆహారం. సాధారణ బిర్యానీలో ఉండే మసాల కారణంగా తరచూ ఆరగించే వారికి కొవ్వు పెరిగి వ్యాధుల బారిన పడుతుండడం సహజం. ఇదే విషయమై వైద్యులు కూడా హెచ్చరిస్తుంటారు.ఈ మండీ బిర్యానీ పూర్తి భిన్నం. ఇందులో ఎలాంటి మసాల వస్తువులు లేకపోవడంతో పాటు బాదం, పిస్తా, చిరంజీ, కిస్‌మిస్‌ తదితర డ్రై ఫ్రూట్స్‌ను కూడా వేస్తారు. ఎండుకారం అసలు వేయరు. తక్కువ మోతాదులో పచ్చి మిరపకాయల మిశ్రమం, తక్కువ ఉప్పు వేస్తారు. మండీలో కలుపుకొని తినేందుకు ఇచ్చే వెల్లుల్లి మిశ్రమం కూడా కొవ్వును తగ్గిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.  
చదవండి: బయట బిర్యానీ తింటున్నారా.. తస్మాత్‌ జాగ్రత్త!

ఒకే పాత్రలో తినడమే ప్రత్యేకత 
సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఎవరి ప్లేట్‌లో వారు అన్నం తినడం సహజం. కాని ఐదారుగురు వ్యక్తులు ఒకే ప్లేట్‌లో భోజనం చేయడం ఈ మండీ ప్రత్యేకత. ఇలా ఏ హోటల్‌లో చూసినా ఇదే కనిపిస్తుంది. నలుగురైదుగురు స్నేహితులు గ్రూప్‌గా వచ్చి సంయుక్తంగానే ఒకే ప్లేట్‌లో ఆరగిస్తూ తమ స్నేహబంధాన్ని చాటుకుంటారు. నగరంలోని కళాశాలల విద్యార్థులు ఐదారుగురు కలిసి వచ్చి  తినడం సాధారణంగా కనిపిస్తోంది.  ఈ హోటళ్లన్నీ అరబ్‌ స్టైల్‌ను అనుసరిస్తున్నాయి. ఏ మతామ్‌లోకి వెళ్లినా ఐదారుగురు కలిసి భోజనం చేసేలా చిన్న చిన్న గదులను నిర్మించి వాటిని పరదాలతో అందంగా ముస్తాబు చేసి ఉంచారు.  

మండీ తయారు చేసే విధానం.. 
మాంసం ఉడికించిన నీటిలోనే బియ్యాన్ని ఉడికించడం ఈ మండీ ప్రత్యేకత. మొదటగా మటన్‌/చికెన్‌ ముక్కలను పెద్ద పరిమాణంలో కట్‌ చేస్తారు. అనంతరం మాంసం ముక్కలకు తక్కువ మోతాదులో పచ్చి మిరపకాల మిశ్రమం, ఉప్పు, జైతూన్‌ ఆకు, పాలు, ధనియాలు, దాల్చన చెక్క, జాఫ్రాన్, జాపత్రి మిశ్రమాలను కలిపి గంట పాటు ఉంచుతారు. అనంతరం నీటిలో వేసి ఉడికిస్తారు. ఇలా ఉడికిన అనంతరం మాంసం బయటికి తీసి ఆ నీటిలోనే బియ్యం వేసి ఉడికిస్తారు.

ఇలా బియ్యం ఉడికి మండీగా మారిన అనంతరం దానిలో ఖాజు, బాదం, పిస్తా, చిరంజీ, కిస్‌మిస్, ఖర్జూరను కలుపుతారు. ఉడికిన మాంసం ముక్కలను మంటపై కొద్దిగా కాలుస్తారు. అనంతరం ప్లేట్‌లో మండీ వేసి దానిపై ఈ మాంసం ముక్కలు, పచ్చి మిరపకాయలు, వెల్లుల్లి మిశ్రమాన్ని ఉంచి వినియోగదారులకు ఇస్తారు. ఆహారాన్ని బొగ్గుల పొయ్యిపైనే తయారు చేస్తున్నారు. బిర్యానీ తయారు చేసేందుకు అరబ్‌ దేశానికి చెందిన వంట మాస్టర్లనే వినియోగిస్తున్నారు. 

ప్రధాన రోహదారుల్లో వెలుస్తున్న హోటళ్లు 
ఎర్రకుంట ప్రధాన రహదారికిరువైపులా వెలిసిన మతామ్‌లతో ఆ రహదారిని ప్రస్తుతం మండీ రోడ్డుగా పిలుస్తున్నారు. ఎర్రకుంట బారా మల్గీస్‌ నుంచి మొదలుకొని షాహిన్‌నగర్‌ హైవే హోటల్‌ వరకు దాదాపు 30 మండీ మతామ్‌లు వెలిశాయటే  ఎంత డిమాండ్‌ ఉందో తెలుసుకోవచ్చు.   

మరిన్ని వార్తలు