మానేరు వాగు గల్లంతు ఘటన: స్పందించిన కేటీఆర్‌..

16 Nov, 2021 12:28 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: మానేరువాగులో ఆరుగురు బాలురు గల్లంతు కావడం పట్ల మంత్రి కే.తారకరామారావు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన పైన జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. చనిపోయిన బాలుర కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

నియోజకవర్గంలోని జలవనరులు సంపూర్ణంగా నిండి ఉన్న నేపథ్యంలో ప్రజలు ఆయా ప్రాంతాల్లోకి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వహించాలని కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టుల వద్ద సాధ్యమైనన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా అధికారులకు మంత్రి కేటీఆర్ సూచించారు. ప్రభుత్వం తరఫున ఆయా కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు.

సరదాగా 8 మంది స్నేహితులు మానేరు వాగులో ఈతకు వెళ్లిన ఘటన విషాదంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రాజీవ్‌నగర్‌కు చెందిన కొలిపాక గణేశ్‌(15), జడల వెంకటసాయి(14), తీగల అజయ్‌(14), కొంగ రాకేశ్‌ (15) శ్రీరామ్‌ క్రాంతి (14) వాగులోకి దూకారు. నీరు లోతుగా ఉండటంతో వారంతా గల్లంతయ్యారు. దీంతో భయపడిన సింగం మనోజ్‌(14), దిడ్డి అఖిల్‌(15)తోపాటు మరో బాలుడు అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు ఐదుగురి మృతదేహలు లభ్యమయ్యాయి. మరోకరి కోసం గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు