నోరూరించే ఆవకాయలు.. ఆకాశానికి ధరలు!

27 May, 2021 09:23 IST|Sakshi

పచ్చళ్ల తయారీలో మహిళలు బిజీ

చుక్కలనంటుతున్న ముడి సరుకుల ధరలు 

సాక్షి, నల్గొండ : వేసవి వచ్చిందంటే చాలు.. అందరి చూపు మామిడికాయ పచ్చడి వైపే ఉంటుంది. ఇటీవల ఎక్కువగా తయారు చేసిన పచ్చళ్లు కొనుక్కునే వాళ్లంతా ప్రస్తుతం లాక్‌డౌన్‌ కలిసి రావడంతో సొంతంగా తయారు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇంటి పట్టున ఉన్న మహిళలంతా మామిడికాయ పచ్చడి తయారు గురించే ముచ్చటించుకుంటున్నారు. ఇంట్లో పెద్ద వారి సూచనలతో ఇంటిళ్లి పాది ఆవకాయ తయారీలో ఓ చేయి వేస్తున్నారు. చెక్క పచ్చడి, తరుగుడు పచ్చడి, అల్లం వెల్లిపాయ ఆవ, ఉప్పు ఆవ, బెల్లం ఆవ, నువ్వుల పచ్చడి తదితర ఎన్ని పేర్లున్నా అనిర్వనీయమైన రుచి ఆవకాయ సొంతం. అయితే ఇటీవల ఈదురు గాలులకు మామిడి కాయలు దెబ్బతిని కొంత కొరత ఏర్పడటంతో ధరలు అమాంతంగా పెరిగాయి. పచ్చడి మామిడి కాయ ఒక్కటి రూ.10 నుంచి రూ.15 వరకు పలుకుతుంది. 

పెరిగిన సామగ్రి ధరలు..
పచ్చడి తయారీలో ప్రధానమైన వంట సామగ్రి అయిన నూనె, అల్లం, వెల్లుల్లి, కారం. వీటి ధరలు విపరీతంగా పెరిగాయి. పచ్చడి తయారీకి వినియోగించే నువ్వుల నూనె బ్రాండ్‌ను బట్టి కేజీ రూ.400 వరకు విక్రయిస్తున్నారు. పల్లీ నూనె అయితే కేజీకి రూ.150 నుంచి రూ.180 వరకు విక్రయిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం అల్లం కిలో రూ.50, వెల్లుల్లి రూ.80లకు విక్రయించగా లాక్‌డౌన్‌ కారణంగా ప్రస్తుతం అల్లం రూ.90, వెల్లుల్లి రూ.120 వరకు పెరిగింది. మామిడికాయ పచ్చళ్లలో ఉపయోగించే మిరప బ్రాండ్‌ను బట్టి కేజీకి రూ.400 నుంచి రూ.500 వరకు ఉన్నవి. 

కిలో పచ్చడికి సుమారు రూ.500 వ్యయం..
కిలో పచ్చడి తయారీకి సాధారణంగా పావుకిలో నూనె, పావుకిలో ఉప్పు, 125 గ్రాముల కారం పొడి, అర కిలో అల్లం వెల్లుల్లితో పాటు మెంతులు, జీలకర్ర, ఆవాల పొడి వినియోగిస్తారు. ఆయా సరుకులతో పాటు మామిడి కాయలు.. అన్నింటి వ్యయం కలిపి కిలోకు రూ.500 ఖర్చవుతోంది. గతంలో ఒక్కో కుటుంబం 100 నుంచి 150 కాయల వరకు పెట్టే వారు. ప్రస్తుతం ఎక్కువగా బీపీ, షుగర్‌ జబ్బులు వస్తుండడంతో ఉప్పు ఎక్కువగా ఉపయోగించే పరిస్థితి లేదు. దీంతో 20 నుంచి 50 కాయల వరకే పెడుతున్నామని మహిళలు చెబుతున్నారు. 

ధరలు బాగా పెరిగాయి 
గతంలో మామిడికాయలకు అల్లం వెల్లుల్లి, కారం, ఇతర వస్తువులకు ధరలు తక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సరం ధరలు అధికంగా పెరగడంతో ఆర్థిక భారం అవుతోంది. అయినా ప్రతి వేసవిలో మారిగానే.. ఈ సారి కూడా పచ్చడి పెడుతున్నాం.
– జి.హేమలత, గృహిణి, తిరుమలగిరి 

మరిన్ని వార్తలు