కౌశిక్‌రెడ్డి.. మధురై కోర్టుకు స్వాగతం: ఠాగూర్‌

13 Jul, 2021 03:38 IST|Sakshi

పరువు నష్టం వ్యవహారంలో సుధీర్‌రెడ్డి, కౌశిక్‌రెడ్డిలపై మాణిక్యం ఠాగూర్‌ వ్యాఖ్య

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో పరువు నష్టం దావాల పరంపర కొనసాగుతోంది. ఇటీవల టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మాణిక్యం ఠాగూర్‌ లీగల్‌ నోటీస్‌ పంపించిన విషయం తెలిసిందే. మాణిక్యం రూ.25 కోట్లు తీసుకొని రేవంత్‌కు పీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు.

అయితే తాజాగా సోమవారం కాం గ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసిన కౌశిక్‌రెడ్డి కూడా రేవంత్‌కి పదవి ఇప్పించేందుకు మాణిక్యం ఠాగూర్‌ రూ.50 కోట్లు తీసుకున్నారని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఠాగూర్‌ ఘాటుగా స్పందించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఓడించి, కాంగ్రెస్‌ను గెలిపించడం తన ప్రాథమిక కర్తవ్యం కాబట్టే సీఎం చంద్రశేఖర్‌రావుకు విధేయులైన వారు ఎప్పుడూ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తారని ఠాగూర్‌ విమర్శించారు. ఈ వ్యవహారంలో తన న్యాయవాదులు కౌశిక్‌రెడ్డికి పరువు నష్టం నోటీసు జారీ చేస్తారని, మదురైలో ఫిర్యాదు నమోదు అవుతుందన్నారు. వారికి మదురై కోర్టుకు స్వాగతమని మాణిక్యం ఠాగూర్‌ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు