ఐక్యత, క్రమశిక్షణతోనే విజయం  

20 Sep, 2020 04:13 IST|Sakshi

రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పనిచేయండి

జూమ్‌ మీటింగ్‌లో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు మాణిక్యం ఠాగూర్‌ దిశానిర్దేశం

బూత్‌ల వారీగా పార్టీని సిద్ధం చేయాలని పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ మరోసారి జూమ్‌ మీటింగ్‌లో రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేశారు. ఇన్‌చార్జిగా నియమితులైన తర్వాత రెండోసారి శనివారం ఆయన పార్టీ నాయకులతో జూమ్‌ యాప్‌ ద్వారా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శులు, లోక్‌సభ అభ్యర్థులు, మాజీ మంత్రులు, ఇతర సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో మాణిక్యం మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పార్టీ నాయకులు పనిచేయాలని సూచించారు. నేతల మధ్య ఐక్యత, క్రమశిక్షణే విజయసోపానాలని వ్యాఖ్యానించారు. 2023లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం కోసం నియోజకవర్గ కేంద్రీకృత విధానాన్ని అవలంబించాలని, రాష్ట్రంలో ఉన్న 34,360 పోలింగ్‌ బూత్‌లలో ప్రతి బూత్‌లో పార్టీకి మెజార్టీ వచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ‘మనం ఆటకు దూరంగా లేము. సరైన అవగాహనతో పోరాడాలి. నాయకులందరి మధ్య నిరంతర సమన్వయం ఉండాలి. కేడర్‌ను గాడిలో పెట్టడం ద్వారా, వారికి క్రమశిక్షణ అలవర్చడం ద్వారా విజయం సాధించాలి’అని పిలుపునిచ్చారు.

పార్టీలో సీనియర్లు, జూనియర్లు అనే భేదాలు లేవని, అవసరమైనప్పుడు సీనియర్ల సలహాలు తీసుకోవడం చాలా విలువైనదని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ ముఖ్య నేతలను మరోమారు టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ మాణిక్యంకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్‌ మాట్లాడుతూ, తెలంగాణలో ఏ వర్గం సంతృప్తిగా లేదని, సంపద అంతా ఒకే కుటుంబం వైపు పోగుపడుతోందని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క, పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమకుమార్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, రాష్ట్ర మాజీ మంత్రులు జె.గీతారెడ్డి, ఆర్‌.దామోదర్‌రెడ్డి, మర్రి శశిధర్‌రెడ్డి, ఎస్‌.చంద్రశేఖర్, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రావణ్, టీపీసీసీ ముఖ్య నేతలు మల్లు రవి, అంజన్‌కుమార్‌ యాదవ్, ఫిరోజ్‌ఖాన్, మదన్‌ మోహన్, గడ్డం వినోద్‌ తదితరులు పాల్గొన్నారు. మూడు గంటల పాటు సాగిన ఈ సమావేశంలో దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నిక, రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్‌  ఎన్నికలపై చర్చించారు. పలువురు నాయకులు ఎన్నికల కార్యాచరణపై తమ అభిప్రాయాలను వెల్లడించారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా