ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీ 

30 Aug, 2021 01:37 IST|Sakshi

బీజేపీ, టీఆర్‌ఎస్‌ కుమ్మక్కు 

కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ 

కరీంనగర్‌టౌన్‌: కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ.. రెండూ ఒక్కటేనని, ఢిల్లీలో దోస్తీ చేస్తూ గల్లీలో కుస్తీ పడుతున్నట్లు నటిస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌ విమర్శించారు. ఆదివారం ఆయన కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్‌ కుటుంబం రాష్ట్రాన్ని దోచేస్తోందని, ఆ కుటుంబ పాలనకు తెర దించాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాత్రి 8 గంటల తర్వాత రాష్ట్రంలో ఎలాంటి విపత్కర సంఘటనలు జరిగినా ప్రజలకు అందుబాటులో ఉండని మోడ్రన్‌ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్‌ అవినీతి, అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థలు చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పూర్తిస్థాయిలో అవినీతిలో కూరుకుపోయారని ఆరోపించారు. మంత్రి గంగుల కమలాకర్‌ అక్రమంగా గ్రానైట్‌ తవ్వకాలు చేస్తూ, కోట్లాది రూపాయల పన్నులు ఎగ్గొట్టినా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటన్నారు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చిత్తశుద్ధి ఉంటే గంగుల కమలాకర్‌ గ్రానైట్‌స్కాంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి బోస్‌ రాజు, పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు