జూబ్లీహిల్స్ సొసైటీలో అవకతవకలపై చర్యలు తీసుకోవాలి: కేతిరెడ్డి

27 Apr, 2021 21:25 IST|Sakshi

హైదరాబాద్‌: జూబ్లీహిల్స్ సొసైటీలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి విచారణ జరిపించాలని తమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు, తెలుగు ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రపదేశ్‌ అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి  తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌ రావును కోరారు. కొంతమంది పెద్దలు మీడియాను అడ్డంపెట్టుకొని, ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నారని ముఖ్యమంత్రికి రాసిన లేఖలో పేర్కొన్నారు. తాము ఏమిచేసిన అడిగేవారే ఎవరు లేరనే నెపంతో సొసైటీలో భారీ కుంభకోణాలను చేస్తూ.. అటు ప్రభుత్వాన్ని, ఇటు సొసైటీ సభ్యులను వంచిస్తున్నారని కేతిరెడ్డి ఆరోపించారు. 

బినామీల పేర్లతో ఉన్న అన్ని లావాదేవిలను వెంటనే రద్దు చేసి నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి నిజాలను నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ‘సొసైటీలో ఒక వ్యక్తికి ఒక ఫ్లాట్ మాత్రమే’ నిబంధనను ఉల్లంఘించి ఎన్నో ఫ్లాట్స్ కలిగివున్న బడా బాబుల నిజస్వరూపంపై కేసీఆర్ ప్రభుత్వం సమగ్ర దర్యాప్తు చేయించాలన్నారు. జూబ్లీహిల్స్ సొసైటీ పరిధిలోని పార్కుల కోసం మాస్టర్ ప్లాన్‌లో వదిలిన ఖాళీ స్థలాలను కూడా వదలకుండా క్రయవిక్రయాలను జరిపిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వేల కోట్లను దోచుకున్న వారిని వెంటనే కస్టడీకి తీసుకొని విచారణ చేపట్టాలని కోరారు.

ఈ మేరకు ప్రధానమంత్రి, రాష్ట గవర్నర్‌, ముఖ్యమంత్రి, తెలంగాణ హైకోర్టు ప్రధాన నాయమూర్తికి కేతిరెడ్డి లేఖలు  రాశారు. ప్రధానికి రాసిన లేఖలో సీబీఐతో దర్యాప్తు చేయించాలని కోరారు. అంతేకాకుండా త్వరలో ఢిల్లీ లో న్యాయపోరాటం చేస్తానని, జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు తెలిపారు.

చదవండి: 
ప్రజారోగ్యాన్ని రాష్ట్రాలకు వదిలేయడం సరికాదు: కేతిరెడ్డి

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు