PV Narasimha Rao: విదేశాంగ విధానంలో వాస్తవికత తెచ్చారు 

29 Jun, 2021 07:59 IST|Sakshi
వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, చిత్రంలో ఉత్తమ్, పొన్నాల, జానారెడ్డి తదితరులు

పీవీ నర్సింహారావు శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌  

కార్డియాలజిస్టు కె.శ్రీనాథరెడ్డికి పీవీ జీవిత సాఫల్య పురస్కారం 

సాక్షి, హైదరాబాద్‌: భారత విదేశాంగ విధానంలో వాస్తవికతను తెరపైకి తెచ్చిన ఘనత పీవీ నర్సింహారావుకు దక్కుతుందని మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ కొనియాడారు. ఇరుగు, పొరుగు దేశాలతో సంబంధాలను మెరుగుపర్చేందుకు ఆయన విశేష కృషి చేశారని ప్రశంసించారు. దేశ ప్రజల వాస్తవిక పరిస్థితులు, ప్రత్యేక స్వభావం, వారి ఆందోళనలను దృష్టిలో ఉంచుకుని, పేదలు, కార్మికుల ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఆర్థిక సంస్కరణలను అమలు చేశారని చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో మాజీ ప్రధాని పీవీ శత జయంతి ఉత్సవాల ముగింపు సభ సోమవారం గాంధీభవన్‌ నుంచి వర్చువల్‌ విధానంలో జరిగింది. కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ జె.గీతారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభలో కేంద్ర మాజీ మంత్రులు మల్లికా ర్జున ఖర్గే, పల్లంరాజు, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్‌తో పాటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి, మాజీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు పాల్గొన్నారు.  

పీపీ సంస్కరణలతో సుదీర్ఘ కాలం మేలు 
ముఖ్య అతిథిగా హాజరైన మన్మోహన్‌సింగ్‌ మాట్లాడుతూ పీవీ నాయకత్వంలోనే ఆర్థిక, విదేశాంగ విధానాల్లో కీలక మార్పులు, సంస్కరణలు వచ్చాయని చెప్పారు. ఈ సంస్కరణల ఫలితాలు సుదీర్ఘ కాలం పాటు దేశ ప్రజలకు మేలు చేయనున్నాయని పేర్కొన్నారు. భారతదేశాన్ని తూర్పు, ఆగ్నేయాసియా దేశాలతో కలిపే విధంగా ‘లుక్‌ ఈస్ట్‌ పాలసీ’ని పీవీ తీసుకువచ్చారని చెప్పారు. ఆయన హయాంలోనే ఏఎస్‌ఎల్వీ, పీఎస్‌ఎల్వీ, బాలిస్టిక్‌ క్షిపణిల పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని, దార్శనికతతో శాస్త్ర, సాంకేతిక రంగాలను సద్వినియోగం చేసుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించిన ఘనుడు పీవీ అని కొనియాడారు.

ఈ సందర్భంగా పీవీ జీవిత సాఫల్య పురస్కారాన్ని ప్రముఖ కార్డియాలజిస్టు డాక్టర్‌ కె.శ్రీనాథరెడ్డికి అందజేశారు. వైద్య రంగంలో శ్రీనాథరెడ్డి చేసిన సేవలకు గుర్తింపుగా అవార్డు ఇవ్వడం సముచితమని మన్మోహన్‌ పేర్కొన్నారు. పీవీ సోదరుడు మనోహర్‌రావుకు కూడా ఈ అవార్డును అందజేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు, మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, శ్రీధర్‌బాబు, వినోద్, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్‌ ఎ.మహేశ్వర్‌రెడ్డి, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పీసీసీ నేతలు వేణుగోపాల్, శ్రవణ్‌కుమార్‌రెడ్డి, నిరంజన్, బొల్లు కిష న్, నగేశ్‌ ముదిరాజ్, పాడి కౌశిక్‌రెడ్డి  పాల్గొన్నారు. 
చదవండి: నన్ను రాజకీయాల్లోకి లాగొద్దు: కోమటిరెడ్డి

మరిన్ని వార్తలు