జడిపించిన జడివాన

19 Jul, 2021 01:42 IST|Sakshi
ఆదివారం సాయంత్రం కురిసిన భారీ వర్షానికి చెరువులా మారిన రాజ్‌భవన్‌ రోడ్డు

రాజధానిలో మళ్లీ కుండపోత..

రహదారులపై నడుములోతు నీరు..

వాహనదారులకు తీవ్ర ఇబ్బంది

జిల్లాల్లో అక్కడక్కడా నీటమునిగిన పంటలు

సాక్షి,హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆదివారం అక్కడక్కడ భారీ వర్షాలు కురిశాయి. సాయంత్రం అకస్మాత్తుగా కురిసిన వర్షం తో ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో చాలాచోట్ల పంటలు నీట మునిగాయి. నిజామాబాద్‌ జిల్లాలో పలు కాలనీలు జల మయమయ్యాయి. హైదరాబాద్‌లోని చార్మినార్, గన్‌ఫౌండ్రి, జూపార్క్‌ తదితర ప్రాంతాల్లో నాలుగు నుంచి ఐదు సెంటీమీటర్ల మేర వర్షం కురిసింది. వరద ధాటికి లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. రోడ్లపై వాననీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.

♦ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ఊర్కొండ మండలం గుడిగాన్‌పల్లి శివారులో కేఎల్‌ఐ కాల్వ తెగిపోయింది. చాలాచోట్ల వందలాది ఎకరాల పంటచేలల్లో వర్షపునీరు నిలిచిపోయింది. కృష్ణానది ఆవలి ఒడ్డున   ఉన్నసంగమేశ్వర ఆలయం సమీపంలోకి నీళ్లు చేరాయి.

♦నిజామాబాద్‌ పట్టణంతోపాటు మోర్తాడ్, కమ్మర్‌పల్లి  మండలాలు, కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలంలో లోతట్టు ప్రాంతాలు, కాలనీల్లోకి వర్షపునీరు చేరింది.

♦సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ డివిజన్‌లో గంటపాటు కురిసిన వానలకు రహదారులు జలమయమయ్యాయి. వరుస వర్షాలతో చెరువులు, కుంటలు, వాగులకు జలకళ సంతరించుకుంది.

రెండ్రోజులు తేలికపాటి వర్షాలు 
రాష్ట్రంలో రానున్న 48 గంటల్లో తేలికపాటి వర్షాలు కురుస్తా యని వాతావరణ శాఖ వెల్లడించింది. మధ్యప్రదేశ్‌ నుంచి విదర్భ, తెలంగాణ, రాయలసీమ మీదుగా దక్షిణ తమిళనాడు తీరం వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వివరించింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ నెల 21న వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది.

మట్టి మిద్దె కూలి మహిళ మృతి 
రాజోళి (అలంపూర్‌): మట్టిమిద్దె కూ లి ఓ మహిళ మృతి చెందగా, ఆమె కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలోని చిన్నధన్వాడకు చెం దిన బోయ సరస్వతమ్మ (50), కృష్ణ య్య దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

ఆషాఢమాసం కావడంతో చిన్నకూతురు నాలుగు రోజుల క్రితమే పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు శనివారం అర్ధరాత్రి ఇల్లు కూలింది. నిద్రిస్తున్న సరస్వతమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, కూతురికి స్వల్ప గాయాలయ్యాయి. కొడుకు ఆరుబయట నిద్రించడంతో ప్రమాదం తప్పింది. ఆదివారం సంఘటనస్థలాన్ని డిప్యూటీ తహసీల్దార్‌ వెంకటరమణ పరిశీలించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు