4  జిల్లాలకు పోలీసు బాస్‌లు లేరు.. 

2 Aug, 2021 01:33 IST|Sakshi

పదోన్నతులు పొందినా పాత కుర్చీల్లోనే పలువురు ఐపీఎస్‌లు 

32 మందికి ఎస్పీలుగా పదోన్నతి.. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూపులు  

పదోన్నతులు పొందినా పాత కుర్చీల్లోనే పలువురు ఐపీఎస్‌లు 

32 మందికి ఎస్పీలుగా పదోన్నతి.. పోస్టింగ్‌ల కోసం ఎదురుచూపులు  

సాక్షి, హైదరాబాద్‌: పలు జిల్లాలకు, కమిషనరేట్లకు పూర్తిస్థాయి పోలీసు బాస్‌లు లేరు. కొందరికి పదోన్నతులు లభించినా పాతస్థానాల్లో కొనసాగుతున్నారు.  2018 నుంచి ఇప్పటి వరకు ఐపీఎస్‌ అధికారులకు భారీ స్థాయిలో స్థానచలనాలు జరగపోవడం గమనార్హం.  ఐదేళ్ల క్రితం ఒకేసారి ఏర్పడిన రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, సిద్ధిపేట పోలీసు కమిషనరేట్లలో ఖమ్మం, సిద్ధిపేటలకు కమిషనర్లు మారినా రామగుండం సీపీ సత్యనారాయణ, నిజామాబాద్‌లో కార్తికేయ కమిషనర్లుగా అక్కడే ఉన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో తాజాగా కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డిని డీజీపీ కార్యాలయానికి ప్రభుత్వం అటాచ్‌ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లా లకు పూర్తిస్థాయి ఎస్పీలను నియ మించలేదు. నల్ల గొండ ఎస్పీగా ఉంటూ డీఐజీగా ప్రమోషన్‌ పొం దిన రంగనాథ్‌ కూడా 2018 నుంచి అక్కడే ఎస్పీగా కొనసాగుతున్నారు. 2019 ఏప్రిల్‌లో 23 మంది ఐపీఎస్‌ అధికారులకు పదో న్నతులు ఇచ్చినా పాత స్థానాల్లోనే 90 శాతం మంది కొనసాగుతున్నారు. 

వీరికి అదనపు బాధ్యతలు.. 
ఏడీజీ వీవీ శ్రీనివాసరావు పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ పదవితోపాటు తెలంగాణ స్టేట్‌ పోలీస్‌ అకాడమీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. సంజయ్‌జైన్‌– ఏడీజీ (పీ అండ్‌ ఎల్‌), పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ బాధ్యతలు చూస్తున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు విజిలెన్స్‌ బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఎస్పీ రమణకుమార్‌ బదిలీతో ఏసీబీలో జాయింట్‌ డైరెక్టర్‌ పోస్టు ఖాళీ అయింది. త్వరలో ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు రిటైర్‌ కానున్నారు. దీంతో ఏసీబీలో కీలకమైన రెండు పోస్టులు ఖాళీ అవనున్నాయి. 

ఎస్పీలుగా పదోన్నతులుగా లభించినా... 
మార్చి ఆఖరివారంలో ప్రభుత్వం 32 మంది అడిషనల్‌ ఎస్పీలకు ఎస్పీలుగా పదోన్నతులు కల్పించింది. ఇందులో మెజారిటీ అధికారులకు పోస్టింగులు లేక ఖాళీగా ఉన్నారు. ఇటీవల ప్రభుత్వం పదవీవిరమణ వయసును 58 నుంచి 61కి పెంచడంతో వీరికి పోస్టింగులు ఇవ్వడం సవాలుగా మారిందని సమాచారం.   

ఇన్‌చార్జీలతోనే...
కీలకమైన నాలుగు జిల్లాలకు పూర్తిస్థాయి ఎస్పీలు లేరు. నిర్మల్‌ జిల్లాకు అడిషనల్‌ ఎస్పీ ప్రవీణ్‌కుమార్, ఆదిలాబాద్‌కు అడిషనల్‌ ఎస్పీ రాజేశ్‌ చంద్ర ఇన్‌చార్జి ఎస్పీలుగా వ్యవహరిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత జిల్లాలైన ఆసిఫాబాద్, ములుగు జిల్లాలకు కూడా పోలీసుబాసులు లేరు. ఆదిలాబాద్‌ జిల్లా బాధ్యతలు రామగుండం సీపీకి, ములుగు జిల్లా బాధ్యతలను జయశంకర్‌ భూపాలపల్లి ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌ పాటిల్‌కి అప్పగించారు. ప్రభుత్వం గత ఏప్రిల్‌లో ఖమ్మం సీపీగా విష్ణువారియర్‌ను నియమించగా, ఖమ్మం సీపీగా ఉన్న ఇక్బాల్‌ బదిలీ మీద ఆదిలాబాద్‌కు వెళ్లాల్సి ఉండగా, తన స్థాయి కంటే తక్కువ పోస్టులో విధులు నిర్వహించడం ఇష్టంలేక మిన్నకుండిపోయారని సమాచారం.   

మరిన్ని వార్తలు