అమ్మతనానికి ఎంత కష్టం!

16 May, 2021 13:16 IST|Sakshi

గర్భిణుల పాలిట శాపంగా కరోనా 

ఇప్పటి వరకు 1500 మందికి వైరస్‌ 

చికిత్సలు అందక 18 మంది మృతి  

విషాదాన్ని నింపిన మల్లాపూర్‌ ఘటన

సాక్షి, సిటీబ్యూరో: మాతృత్వాన్ని ఆస్వాదించే అరుదైన క్షణాల కోసం నిండు గర్భిణులు కంటున్న కలలను కరోనా మహమ్మారి చిదిమేస్తోంది. చివరికి తల్లి కాకుండానే మృత్యువు కబళిస్తోంది.  ఫస్ట్‌వేవ్‌లో వందల మందికి పురుడు పోసి.. తల్లీబిడ్డలను క్షేమంగా కాపాడిన ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రులు సెకండ్‌ వేవ్‌లో మాత్రం కనీస రక్షణ కల్పించలేకపోతున్నాయి. ఫలితంగా పలువురు గర్భిణులు మాతృత్వపు మధురిమల్ని అనుభవించకుండానే కన్నుమూస్తున్నారు. నగరంలో ఇప్పటివరకు 18 మంది గర్భిణులు కరోనా కారణంగా మృతి చెందగా.. తాజాగా శుక్రవారం కోవిడ్‌ అనుమానంతో పలు ఆస్పత్రుల్లో అడ్మిషన్‌ దొరక్క మల్లాపూర్‌కు చెందిన నిండుచూలాలు పావని (22) మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. 

మహమ్మారి కోరల్లో చిక్కుకుని..

  • వైద్య ఆరోగ్యశాఖ ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా ఫీవర్‌ సర్వే చేపట్టింది. సుమారు లక్షన్నర మంది జ్వర పీడితులున్నట్లు గుర్తించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లో సుమారు 50 వేల మంది బాధితులు ఉన్నట్లు గుర్తించింది. వీరిలో ఇప్పటికే కోవిడ్‌ నిర్ధారణ అయినవారు 30 వేల వరకు ఉన్నట్లు అంచనా.
  • ఇప్పటివరకు గర్భిణులకు నెలవారీ పరీక్షలు నిర్వహించిన పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, వనస్థలిపురం, కొండాపూర్‌ ఏరియా ఆస్పత్రులు ప్రస్తుతం కోవిడ్‌ కేంద్రాలుగా మారాయి. కోవిడ్‌ నిర్ధారణ పరీక్షలతో పాటు టీకాల కార్యక్రమంతో బిజీగా మారుతున్నాయి. నెలవారీ పరీక్షలకు వచ్చే గర్భిణులు వైరస్‌ బారిన పడుతున్నారు.  
  • గత ఏడాది మార్చి నుంచి ఈ ఏడాది మార్చి వరకు 1,160 మంది గర్భిణులు వైరస్‌ బారినపడి గాంధీలో చేరగా...ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మే 15 వరకు 299 మంది గర్భిణులు వైరస్‌తో ఆస్పత్రిలో చేరారు. వీరిలో 18 మంది మృతి చెందడం కలవరపరుస్తోంది.

ప్రస్తుతం గాంధీలో 45 మంది..
గ్రేటర్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో రోజుకు సగటున 250 ప్రసవాలు జరుగుతుంటాయి. ప్రస్తుతం నాన్‌కోవిడ్‌ గర్భిణులకు సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, నిలోఫర్‌ సహా పలు ఏరియా ఆస్పత్రుల్లో ప్రసవాలు చేస్తుండగా.. కోవిడ్‌ బారిన పడిన గర్భిణులకు మాత్రం గాంధీలో డెలివరీ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఒక్క ఆస్పత్రిలోనే 45 మంది గర్భిణులు చికిత్స పొందుతున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది డెలివరీలు జరుగుతున్నాయి. కేవలం 45 రోజు ల్లోనే 299 మంది గర్భిణులు కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు. వీరే కాకుండా సుల్తాన్‌బజార్, పేట్లబురుజు, ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రసవించిన తర్వాత కోవిడ్‌  నిర్ధారణ అయిన 16 మంది ఆ తర్వాత చికిత్స కోసం గాం«దీలో గైనకాలజీ వార్డులో చేరి వైరస్‌ నుంచి బయటపడ్డారు.  

గర్భిణులకు ప్రత్యేకంగా 95 పడకలు..
కరోనా వైరస్‌ బారిన పడిన గర్భిణులకు చికిత్సలు అందించేందుకు గాంధీ గైనకాలజీ విభాగంలో 95 పడకలతో ప్రత్యేక వార్డును ఏర్పాటు చేశాం. కోవిడ్‌ నిర్ధారణ అయిన గర్భిణులంతా ప్రసవం కోసం ఇక్కడికే వస్తున్నారు. ఇక్కడ రోజుకు సగటున పది నుంచి పదిహేను డెలివరీలు చేస్తున్నాం. పది సహజ ప్రసవాలకు పట్టే సమయం.. ఒక్క కోవిడ్‌ డెలివరీకి పడుతుంది. ఫలితంగా వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆస్పత్రులకు పరుగెత్తవద్దు. గాంధీ ఆస్పత్రికి రావాలి. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరస్కరించబోం.                                                                               
 – డాక్టర్‌ మహాలక్ష్మి, గైనకాలజీ విభాగాధిపతి, గాంధీ ఆస్పత్రి

>
మరిన్ని వార్తలు