Hyderabad: గంజాయి మత్తులో ‘సాఫ్ట్‌వేర్లు’

27 Feb, 2022 06:35 IST|Sakshi

సరఫరా చేస్తున్న వారిలో నైజీరియన్‌ నికోలస్‌ 

డాక్టర్‌ సహా 16 మంది నిందితుల అరెస్టు 

వీరిలో అయిదుగురు సాఫ్ట్‌వేర్‌ సంస్థల ఉద్యోగులే  

రేవ్‌ పార్టీల్లో సింథటిక్‌ డ్రగ్స్‌ సైతం వినియోగం

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని పలు సాఫ్ట్‌వేర్‌ కంపెనీల్లో పని చేస్తున్న ఉద్యోగులు గంజాయి మత్తుకు అలవాటుపడ్డారు. కొన్ని సందర్భాల్లో రేవ్‌ పార్టీలు నిర్వహించుకుంటూ సింథటిక్‌ డ్రగ్‌ ఎండీఎంఏ వినియోగిస్తున్నారు. వీరితో పాటు ఓ వైద్యుడికీ మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముఠా గుట్టును సిటీ నార్కోటిక్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌– న్యూ) అధికారులు రట్టు చేశారు. మొత్తం 16 మందిని అరెస్టు చేశామని, పరారీలో ఉన్న ముగ్గురి కోసం గాలిస్తున్నామని నగర కొత్వాల్‌ సీవీ ఆనంద్‌ పేర్కొన్నారు. హెచ్‌–న్యూ డీసీపీ చక్రవర్తి గుమ్మితో కలిసి శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన  వివరాలు వెల్లడించారు. కోవిడ్‌ విజృంభణ తర్వాతే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగుల్లో డ్రగ్స్‌ అలవాటు పెరిగిందని ఆనంద్‌ తెలిపారు. యాప్రాల్‌కు చెందిన స్టాక్‌మార్కెట్‌ ట్రేడర్‌ జవాలా పాండే తరచు గోవా వెళ్లేవాడు.
 
డ్రగ్స్‌కు అలవాటుపడిన ఇతగాడు ఆపై విక్రయించడం మొదలెట్టాడు. ఆదిలాబాద్‌ జిల్లాకు చెందిన సోనేరావ్, లఖన్‌ గంజాయి పండిస్తున్నారు. దీన్ని అదే జిల్లా వాసులు ఉల్లాస్‌ సాబ్లే, గోటి హరిసింగ్, అమర్‌ సింగ్, సకారాం సాబ్లే ఎర్తిగ కారులో నగరానికి తరలిస్తున్నారు. వీరి నుంచి గంజాయి పాండేకు అందుతోంది. పాండే గంజాయితో పాటు అరకుకు చెందిన యశ్వంత్‌ నుంచి హష్‌ ఆయిల్, పాండుచ్చేరీలో ఉంటున్న నైజీరియన్‌ నికొలస్‌ నుంచి ఎండీఎంఏ డ్రగ్‌ ఖరీదు చేస్తున్నాడు. వీటిని ఇతగాడు ఆదిత్య రాజన్‌ (ప్రైవేట్‌ సంస్థ మేనేజర్‌), జయబాలాజీ (విద్యార్థి), నిఖిల్‌ షెనోయ్‌ (డీజే ప్లేయర్‌)లకు అమ్ముతున్నాడు.  

నగరంలోని అనేక మంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులకు ఈ మాదకద్రవ్యాలు విక్రయిస్తున్నారు. ఏజెన్సీలో కేజీ రూ.10 వేలు ఉంటున్న గంజాయి సిటీలో వినియోగించే వారి దగ్గరకు వచ్చేసరికి రూ.60 వేలకు చేరుతోంది. 10 గ్రాములు 500 ఖరీదు చేస్తున్న ఎండీఎంఏను పెడ్లర్స్‌ రూ.2 వేలకు అమ్ముతున్నారు. మాదకద్రవ్యాలను పెడ్లర్లు రాత్రి వేళల్లో కార్ఖానా వద్ద ఉన్న హాకీ గ్రౌండ్స్‌లో వినియోగదారులకు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఏసీపీ కె.నర్సింగ్‌రావు పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్లు పి.రాజేష్, పి.రమేష్‌రెడ్డిలు తమ బృందాలతో రంగంలోకి దిగారు. 

డ్రగ్స్‌ విక్రేతలు పాండే, నికోలస్, నిఖిల్, సోనేరావ్, అమర్, ఉల్లాస్, సకారాం, హరీష్, ఆదిత్య, జయ బాలాజీలను పట్టుకున్నారు. వీరి నుంచి డ్రగ్స్‌ ఖరీదు చేసి వినియోగిస్తున్న బంజారాహిల్స్‌ వాసి మహ్మద్‌ మడ్నే (వైద్యుడు), మాదాపూర్‌ వాసి సాయి అనిరుధ్‌ (ఐటీ కంపెనీ ఫౌండర్‌), మియాపూర్‌ వాసి కుషా మిశ్రా (ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో క్వాలిటీ అనలిస్ట్‌), శేరిలింగంపల్లికి చెందిన సిద్థార్థ్‌ విజయ్‌ కుమరన్‌ (ప్రముఖ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో బిజినెస్‌ కన్సల్టెంట్‌), నిజాంపేల వాసి రోహిత్‌ కుమార్‌ (ఐటీ కంపెనీలో హెచ్‌ఆర్‌ విభాగం), గంగారం వాసి బాలాజీ భగవాన్‌ సింగ్‌లను (ఐటీ కంపెనీ కౌంటెంట్‌) అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.5.4 లక్షల విలువైన డ్రగ్స్, వాహనాలు స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం 
గాలిస్తున్నారు.   

>
మరిన్ని వార్తలు