మన్యంలో మళ్లీ అలజడి

19 Oct, 2020 10:15 IST|Sakshi

సాక్షి,  ములుగు/మంగపేట: ములుగు జిల్లాలో వారం రోజుల్లో రెండోసారి అలజడి రేగింది. మంగపేట మండలం నర్సింహసాగర్‌ పరిధి ముసలమ్మగుట్ట సమీపంలో గ్రేహౌండ్స్‌ బలగాలు, మావోయిస్టుల మధ్య ఆదివారం జరిగిన ఎదు రు కాల్పుల్లో మావోయిస్టు మణుగూరు ఏరియా దళ కమాండర్‌ సుధీర్‌ అలియస్‌ రాముతో పాటు ఒక దళ సభ్యుడు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సంగ్రాంసింగ్‌ పాటిల్‌ తెలిపారు. వారి వద్ద ఒక ఎస్‌ఎల్‌ఆర్, రెండు ఇతర వెపన్స్‌ లభించినట్లు చెప్పారు. ఇటీవల వెంకటాపురం(కె) మండలం బోధాపురంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు మాడూరి భీమేశ్వరావు(48)ను మావోలు హతమార్చారు. తాజా ఎన్‌కౌంటర్‌ ఘటన మన్యంలో మళ్లీ అలజడి నెలకొంది.    

వరుస ఘటనలు.. 
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో 2015 సెప్టెంబర్‌ 15న గోవిందరావుపేట మండలం మొద్దుగుట్టలో మొదటి ఎన్‌కౌంటర్‌ జరిగింది. ఈ సంఘటనలో మావోయిస్టులు శృతి, విద్యాసాగర్‌ హతం కావడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. అప్పటి నుంచి ఎన్‌కౌంటర్లు జరగలేదు. మధ్యమధ్యలో చెదురుమదురు సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. జిల్లా సరిహద్దులోని వాజేడు, వెంకటాపురం(కె) మండలాల్లో పలు చోట్ల మావోయిస్టుల పేరుతో కరపత్రాలు, టిఫిన్‌ బాంబులు లభ్యమయ్యాయి. అయినా ఆ స్థాయిలో ప్రాణనష్టం జరగలేదు. ప్రశాంతంగా ఉన్న ఏజెన్సీలో ఈనెల 10న జరిగిన ఘటన కలకలం రేపింది. మావోయిస్టులు వెంకటాపురం(కె) మండలంలోని  బోధాపురం గ్రామానికి చెందిన టీఆర్‌ఎస్‌ నాయకుడు, పురుగు మందుల వ్యాపారి భీమేశ్వర్‌రావును కత్తులతో పొడిచి చంపారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసు యంత్రాంగం ముమ్మరంగా కూంబింగ్‌ చేపట్టింది. ఈక్రమంలో తిప్పాపురం గ్రామానికి చెందిన మావోయిస్టు మిలీషియా సభ్యుడు చిన్నలక్ష్మయ్యను అదుపులోకి తీసుకున్నారు. 

పక్కా సమాచారం మేరకు సోదాలు.. 
మావోయిస్టు మిలీషియా సభ్యుడు ఇచ్చిన పక్కా సమాచారం మేరకు కేంద్ర బలగాలు నర్సింహసాగర్, కొప్పుగుట్ట, దోమెడలోని దట్టమైన అడవుల్లో కూంబింగ్‌ నిర్వహించినట్లు తెలుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున అటవీలోకి ప్రవేశించిన పోలీసు బలగాలు మావోయిస్టుల స్థావరాన్ని గుర్తించి కాల్పులు జరిపినట్లుగా సమాచారం. ఎన్‌కౌంటర్‌లో మరికొంత మంది తప్పించుకున్నారనే సమాచారం మేరకు గాలింపు మరింత ముమ్మరం చేశారు. 

ఏజెన్సీలో ఉలికిపాటు..
ఎన్‌కౌంటర్‌ సంఘటనతో ఏజెన్సీ ప్రాంతం ఉలిక్కిపడింది. పోలీసులు ఏటూరునాగారం, ఎస్‌ఎస్‌తాడ్వాయి, మంగపేట మండలాలతో పాటు పొరుగున ఉన్న భద్రాద్రికొత్తగూడెం జిల్లాలోని కరకగూడెం, పినపాక మండలాల అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున జల్లెడపడుతున్నారు. దీంతో సమీప గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు