కదంబా అడవుల్లో ఎన్‌కౌంటర్‌

20 Sep, 2020 09:14 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: మన్యంలో తుపాకీ మోత మోగింది. జిల్లాలోని కాగజ్‌నగర్‌ మండలం కదంబా అడవుల్లో ఎన్‌కౌంటర్‌ ఉలిక్కిపడేలా చేసింది. శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోలు మృతిచెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కొద్ది రోజులుగా జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు నిత్యం అప్రమత్తంగా ఉంటున్నారు. ప్రాణహిత సరిహద్దు మీదుగా ప్రత్యేక బలగాలతో కూంబింగ్‌ కొనసాగుతోంది.

రెండు రోజులుగా జిల్లావ్యాప్తంగా అనువణువు గాలిస్తున్న పోలీసులు కాగజ్‌నగర్‌ మండలంలోని కదంబా అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తుండగా మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందినట్లు పోలీసువర్గాలు అనుమానిస్తున్నాయి. కేబీఎం (కుమురం భీం, మంచిర్యాల) డివిజన్‌ కమిటీకి సారథ్యం వహిస్తున్న, మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తప్పించుకున్నట్లు తెలుస్తోంది.

పక్కా సమాచారంతోనే..
జిల్లాలో మావోయిస్టులు సంచరిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ముఖ్యంగా కాగజ్‌నగర్‌ డివిజన్‌ పరిధిలోని మండలాలు, ప్రాణహిత నది తీరం వెంట డీఎస్పీ స్వామి ఆధ్వర్యంలో 8 గ్రేహౌండ్స్‌ బలగాలు కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. నేరుగా డీఎస్పీ స్వామి మారుమూల గ్రామాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిఘా ఉంచిన పోలీసులు కదంబా అడవుల్లో మావోయిస్టులు తిరుగుతుండగా ప్రణాళికతో ముందుకు సాగినట్లుగా తెలుస్తోంది. కాగా ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మాత్రమే చనిపోగా మరికొందరు తప్పించుకున్నట్లు సమాచారం. తప్పించుకున్న వారిలో భాస్కర్‌తో పాటు లింగయ్య, వర్గీస్, ప్రభాత్‌ ఉన్నట్లు తెలుస్తోంది.

రెండు రోజులుగా జిల్లాలో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న భయం నెలకొంది. గురువారం రాత్రి ఆసిఫాబాద్‌ మండలం చిలాటిగూడను పోలీసు బలగాలు చుట్టుముట్టాయి. అక్కడ దళ సభ్యులు తృటిలో తప్పించుకున్నారు. దీంతో పోలీసులు అనుమానిత ప్రాంతాలను తనిఖీ చేశారు. శుక్రవారం సైతం సమీప అటవీ ప్రాంతాలతో పాటు పత్తి చేలు, ఆసిఫాబాద్‌ ప్రధాన రోడ్డుపై గస్తీ కొనసాగింది. దళ సభ్యులు కదంబా అడవుల వైపు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నిఘా పెట్టిన పోలీసులు పక్కా ప్రణాళికతో ఎన్‌కౌంటర్‌ చేసినట్లు సమాచారం.

తప్పించుకున్న భాస్కర్‌?
కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో కేబీఎం(కుమురం భీం, మంచిర్యాల) డివిజన్‌ కమిటీకి సారథ్యం వహిస్తున్న మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ తప్పించుకున్నట్లు తెలుస్తోంది. భాస్కర్‌ నేతృత్వంలోని ఆరుగురు దళ సభ్యులు ఉమ్మడి జిల్లాలో కొద్దికాలంగా సంచరిస్తున్న విషయం తెలిసిందే. లాక్‌డౌన్‌ సమయంలో వలస కూలీల రూపంలో జిల్లాలోకి చొరబడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల పరిధిలోని అటవీ ప్రాంతాలు, ప్రాణహిత తీరం వెంట సంచరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

అందుకనుగుణంగానే తిర్యాణి మండలం టోక్కిగూడ అడవుల్లో రెండుసార్లు తృటిలో తప్పించుకున్నారు. అప్పటి నుంచి నిఘా పెట్టిన పోలీసు బలగాలు మావోల సంచారంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. మావోయిస్టులకు సహకరిస్తున్నట్లు అనుమానం కలిగిన ప్రతి ఒక్కరిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మావోయిస్టులకు భోజనం పెట్టిన తిర్యాణి మండలానికి చెందిన ఓ వ్యక్తిని సైతం అరెస్టు చేసి ఆదిలాబాద్‌ జైల్‌లో ఉంచారు. 

రెండుసార్లు డీజీపీ పర్యటన..
కొద్ది రోజులుగా దళ సభ్యుల సంచరిస్తున్నారనే సమాచారం ఉన్న ప్రతిచోటా గస్తీని విస్తృతం చేస్తున్నారు. ఇటీవల దళ సభ్యుల నియంత్రణలో భాగంగా డీజీపీ మహేందర్‌ రెడ్డి జిల్లాలో రెండుసార్లు పర్యటించారు. ఆగస్టులో ఓసారి పర్యటించగా, ఈనెల రెండో తేదీన ఆసిఫాబాద్‌కు వచ్చిన ఆయన నాలుగు రోజులు మకాం వేశారు. క్షేత్రస్థాయిలో పలు విషయాలు తెలుసుకుని మావోల సంచారం నేపథ్యంలో అనుసరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. కదంబా అడవుల్లో జరిగిన తాజా ఎన్‌కౌంటర్‌తో జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఎప్పుడు ఎక్కడ తుపాకీ చప్పుళ్లు వినాల్సి వస్తుందోనని ప్రజలు భయాందోళనలో ఉన్నారు. 

 

మరిన్ని వార్తలు