కాల్చి చంపారు: మావోయిస్టు భాస్కర్‌ ఆగ్రహం

20 Sep, 2020 20:55 IST|Sakshi

టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలను హెచ్చరిస్తూ లేఖ విడుదల

సాక్షి, మంచిర్యాల: మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడు, కుమురం భీం, మంచిర్యాల (కేబీఎం) డివిజన్‌ కమిటీకి సారథ్యం వహిస్తున్న మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్‌ పేరిట ఓ లేఖ విడుదలైంది. కాగజ్ నగర్ మండలం కందంబ అడవుల్లో ఎన్‌కౌంటర్‌ బూటకమని లేఖలో భాస్కర్ పేర్కొన్నారు. దానిని ఖండిస్తున్నామని తెలిపారు. తమ దళ సభ్యులను పోలీసులు పట్టుకొని కాల్చిచంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వచ్చిన చుక్కాలు, బాజీరావును పోలీసులు చుట్టిముట్టి కాల్చి చంపారని ఆవేదన వ్యక్తం చేశారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు బాధ్యులైన టీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలకు ప్రజల చేతిలో శిక్షలు తప్పవ భాస్కర్ హెచ్చరించారు. తెలంగాణలో ప్రజలపై జరుగుతున్న పాశవిక అనుచివేతకు తాజా ఎన్‌కౌంటరే ఉదాహరణ అని అన్నారు. 

2022 నాటికి విప్లవోద్యమాన్ని అణిచివేసే ఉద్దేశ్యంతోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని తెలిపారు. కామ్రేడ్ చుక్కాలు, బాజీరావ్‌లు అమరులయ్యారని, ఇంతటితో విప్లవోద్యమం ఆగదని చెప్పారు. తెలంగాణ విప్లవోద్యమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. నూతనంగా పార్టీలో చేరిన బాజీరావు నింపిన పోరాటపటిమ ఉమ్మడి ఆదిలాబాద్‌లో చిరస్థాయిగా నిలుస్తుందని భాస్కర్‌ లేఖలో పేర్కొన్నారు. కామ్రేడ్స్‌ చుక్కాలు, బాజీరావు అమరత్వం, త్యాగం వృధా కానివ్వమని అన్నారు. కాగా, కాగజ్‌నగర్‌ మండలంలోని కదంబ అడవుల్లో శనివారం రాత్రి పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు వార్తలు వెలుడిన సంగతి తెలిసిందే. ఆ ఎన్‌కౌంటర్‌ నుంచి కేబీఎమ్‌ డివిజన్‌ కమిటీ నాయకుడు భాస్కర్‌ తృటిలో తప్పించుకున్నాడని సమాచారం.
(చదవండి: కదంబా అడవుల్లో ఎన్‌కౌంటర్‌)

మరిన్ని వార్తలు