అడవిలో అన్నలకు అనారోగ్యం

29 Jan, 2021 18:39 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

మందులు, చికిత్స అందక మరణాలు

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన  భిక్షపతి మరణం

పోలీసుల దిగ్బంధనమే కారణమని అధికార ప్రతినిధి జగన్‌ లేఖ

పోలీస్‌ ఎదురుదాడులతో మావోయిస్టులు ఉక్కిరిబిక్కిరి

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ప్రవేశించకుండా కొంతకాలంగా పోలీసులు తీసుకుంటున్న చర్యలు మావోయిస్టులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. లాక్‌డౌన్‌ను ఆసరాగా చేసుకుని తిరిగి నెట్‌వర్క్‌ ను విస్తరిద్దామన్న ఆలోచనతో రాష్ట్రంలోకి అడుగుపెట్టిన నక్సల్స్‌కు పోలీసుల ప్రతి వ్యూహంతో ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్ర అడవుల్లో పోలీసులు నిరంతరం కూంబింగ్‌ చేపడుతూ మావోయిస్టులను తిరిగి ఛత్తీస్‌గఢ్‌ వైపు తరుముతున్నారు. దీంతో అన్నలు అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. ముఖ్యంగా కొంతకాలంగా మావోయిస్టుల్లో చాలామంది అనారోగ్యం బారినపడ్డారని తెలిసింది.

లాక్‌డౌన్‌ కాలంలో చందాల వసూళ్లు, రిక్రూట్‌మెంట్, మందులు, ఇతర నిత్యావసరాలు సమకూర్చుకున్నారు. కానీ, పోలీసులు రాష్ట్రంలోకి వచ్చిన మావోయిస్టులను తిరిగి ఛత్తీస్‌గఢ్‌కు తరిమికొట్టే ఆపరేషన్‌ ప్రారంభించడంతో వారికి కష్టాలు మొదలయ్యాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో గాలింపు, నిరంతర కూంబింగ్, నదీపరీవాహక ప్రాంతాలపై నిఘా చర్యలతో మావోయిస్టు కొరియర్‌ వ్యవస్థ స్తంభించింది. లాక్‌డౌన్‌ అనంతరం జరిగిన 11 ఎన్‌కౌంటర్లలో, 11 మంది మరణించారు. 135 మంది లొంగిపోయారు. వీరిలో ఇద్దరు రాష్ట్ర సెక్రటరీలు, నలుగురు జిల్లా కమిటీ, నలుగురు ఏరియా కమిటీ సభ్యులు ఉన్నారు. దీంతో మైదాన ప్రాంతాలకు వచ్చి మందులు, నిత్యావసరాలను అడవుల్లోకి తీసుకెళ్లే కొరియర్‌ వ్యవస్థకు విఘాతం కలిగింది. ఫలితంగా సకాలంలో మందులు అందక, చిన్న జ్వరాలు, రోగాలు అనారోగ్యానికి దారితీస్తున్నాయి.

అగ్రనేతలు రంగంలోకి దిగినా..
మావోయిస్టు రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, బడే చొక్కారావు అలియాస్‌ భాస్కర్, అగ్రనేత హరిభూషణ్‌ సెంట్రల్‌ కమిటీ ఆదేశాలతో రాష్ట్రంలో లాక్‌డౌన్‌ తరువాత పలు ప్రాంతా ల్లో సంచరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిక్రూట్‌మెంట్‌ కోసం తీవ్రంగా శ్రమించినా అనుకున్న మేరకు సఫలీకృతం కాలేకపోయారు. వీరిలో హరిభూషణ్‌ సంచారంపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ, అడెల్లు భాస్కర్‌ రెండు సార్లు, ద్వితీయ శ్రేణి నాయకుడు కంకణాల రాజిరెడ్డి ఒకసారి పోలీసులకు తారసపడ్డారు. వీరిద్దరూ పోలీసుల కాల్పుల్లో త్రుటిలో తప్పించుకున్నారు.

ఎలా తెలిసిందంటే...
మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ లేఖ ద్వారా వెల్లడైంది. ‘భిక్షపతి అలియాస్‌ విజేందర్‌ 2018లో దళంలో చేరాడు. ఏటూరునాగారం–మహదేవ్‌పూర్‌ ఏరియా కమిటీలో పనిచేశాడు. కొంతకాలం క్రితం అనారోగ్యం బారినపడ్డాడు. పోలీసుల అష్టదిగ్బంధనం కారణంగా చికిత్స అందకపోవడంతో ఈనెల 18వ తేదీన మరణించాడు’ అని గురువారం విడుదల చేసిన లేఖలో జగన్‌ ఆరోపించారు. ఈ లేఖ వెలుగులోకి రావడంతో మావోయిస్టు పార్టీ సభ్యులు అనారోగ్యంతో బాధపడుతున్నారని, చికిత్స తీసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారన్న విషయం వెలుగుచూసింది. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో పారాసిటమాల్‌ టాబ్లెట్లు కొనుగోలు చేసేవారిపై పోలీసులు దృష్టి సారించారు. మావోయిస్టులు అప్పుడు కొనుగోలు చేసిన మందులు జనవరి నాటికి దాదాపుగా అయిపోయి ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. ఫలితంగా టాబ్లెట్లు దొరక్క.. బయటకు వచ్చే అవకాశం లేక మావోయిస్టులు తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని సమాచారం.


భిక్షపతి ఇంటి వద్ద విలపిస్తున్న తల్లిదండ్రులు,(ఇన్‌సెట్‌) భిక్షపతి (ఫైల్‌)

మా కొడుకు తిరిగొస్తాడనుకున్నాం
చిట్యాల: అజ్ఞాతంలోకి వెళ్లిన తమ కుమారుడు భిక్షపతి తిరిగి వస్తాడనుకుంటే కానరాని లోకానికి వెళ్లిపోయాడని ఆయన తల్లిదండ్రులు సమ్మక్క–ముత్తయ్య కన్నీటిపర్యంతమవుతున్నారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం ఒడితల గ్రామానికి చెందిన మ్యాదరి సమ్మక్క–ముత్తయ్య దంపతులకు నలుగురు సంతానం. పెద్దకుమారుడు భిక్షపతి డిగ్రీ చదివాడు. 2018లో ఉద్యమంలో చేరాడు.

చదవండి: 
సెల్యూట్‌ పోలీస్‌.. 7 నిమిషాల్లో రక్షించారు

కేసీఆర్ కాళ్లు బరాబర్ మొక్కుతా: మంత్రి

మరిన్ని వార్తలు