-

పచ్చని అడవికి నెత్తుటి మరకలు

22 Sep, 2020 09:03 IST|Sakshi

సాక్షి, మంచిర్యాల: పోలీసు, మావోయిస్టుల మధ్య అనేక ఎన్‌కౌంటర్లకు ఉమ్మడి జిల్లా అడవులు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదిలాబాద్‌ జిల్లా ఉమ్మడి రాష్ట్రంలోనే మావోయిస్టులకు గట్టి పట్టున్న ప్రాంతం కావడంతో పదేళ్ల క్రితం వరకూ ఇక్కడి అడవుల్లో తుపాకుల మోతలు వినిపించేవి. అప్పటి పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ నుంచి నేటి మావోయిస్టు పార్టీ వరకు ఎన్నో ఎన్‌కౌంటర్లు జరిగాయి. యాక్షన్‌ టీం మెంబర్ల నుంచి కేంద్ర కమిటీ సభ్యుల వంటి అగ్రనేతలపై పోలీసు తుటాలు పేలాయి. ఈ ఆధిపత్య పోరులో ఒక్కోసారి దళ సభ్యులది.. ఎక్కవసార్లు పోలీసు బలగాలది పైచేయిగా మారింది. దళ సభ్యుల క్యాంపులపై బలగాలు విరుచుకుపడిన ఘటనలు ఉండగా.. పక్కా సమాచారంతో మాటువేసి దాడులు చేసుకున్న ఘటనలూ ఉన్నాయి. కొన్నిసార్లు రోజులకొద్దీ కాల్పులు సాగాయి. దశాబ్దం తర్వాత మళ్లీ కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌ ఉమ్మడి జిల్లాలో గతంలో పేలిన తూటాల చప్పుళ్లను గుర్తుచేసింది. చదవండి: (ఆ 300 మంది మావోయిస్టులు ఎక్కడ?)

సంచలనం రేపిన ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌
2010లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ కాగజ్‌నగర్‌ మండలం జోగాపూర్‌ అటవీప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ కావడం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ ఘటనలో సీనియర్‌ జర్నలిస్టు హేమచంద్ర కూడా చనిపోయారు. ఈ ఎన్‌కౌంటర్‌ బూటకమంటూ ఆజాద్‌ భార్య పద్మ కోర్టులో కేసు వేశారు. దీంతో ఎన్‌కౌంటర్‌లో పాల్గొన్న 20 మంది పోలీసులపై కేసు నమోదు చేయాలంటూ ఆదిలాబాద్‌ స్పెషల్‌ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. చదవండి:(19 ఏళ్లకే దళంలోకి.. మూడు నెలలకే ఎన్‌కౌంటర్‌)

మావోయిస్టులకు భారీ దెబ్బ తగిలిన సంఘటనలు

  • 2001లో జన్నారం, దండేపల్లి అడవుల్లో జిల్లా కమిటీ సెక్రటరీ సూర్యం ఎన్‌కౌంటర్‌ అయ్యాడు. కీలక సభ్యుడి మరణంతో పార్టీకి పెద్ద నష్టం వాటిల్లింది. 
  • 2003 డీసీఎస్‌ (జిల్లా కమిటీ సెక్రటరీ)గా ఉన్న ఎల్లంకి అరుణ అలియాస్‌ లలితక్కను ప్రస్తుత కుమురంభీం జిల్లా.. అప్పటి బెజ్జూరు మండలం అగర్‌గూడలోని కొండ ప్రాంతంలో పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఘటనలో ముగ్గురు మహిళా సభ్యులు చనిపోయారు. 
  • 2003లో ప్రస్తుత మంచిర్యాల జిల్లా దేవాపూర్‌లో రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ఉన్న సుదర్శన్‌రెడ్డి అలియాస్‌ రామక్రిష్ణ ఎన్‌కౌంటర్‌తో పార్టీకి పెద్ద నష్టం జరిగింది.
  • 2006లో కాగజ్‌నగర్‌ మండలం మానిక్‌పటార్‌లో వరుసగా మూడు రోజులపాటు కాల్పులు జరగగా.. ఓ దళ కమాండర్‌ సహా ముగ్గరు మావోలు చనిపోయారు. 
  • అంతకుముందు 1989లో ప్రస్తుత నిర్మల్‌ జిల్లా పెంబి మండలం తులసి పేట అడవుల్లో జిల్లా కమిటీ సభ్యుడు సుగుణాకర్, 1992లో ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం చింతలబోరి వద్ద ఎన్‌కౌంటర్‌లో బోథ్‌ దళ కమాండర్‌తోపాటు ఐదుగురు దళ సభ్యులు చనిపోయారు.
  • 1993లో ఆదిలాబాద్‌ జిల్లా బజార్‌హత్నూర్‌ మండలం డెడ్రా అడవుల్లో బోథ్‌ దళ కమాండర్‌తోపాటు ముగ్గురు దళ సభ్యులు మరణించారు. ఇవేకాకుండా కెరమెరి, సిర్పూర్‌(టి), ఖానాపూర్, చెన్నూరు ప్రాంతాల్లోనూ ఎన్‌కౌంటర్లు జరిగాయి. 

మావోయిస్టుల ప్రతీకార దాడులు

  • 1985లో ప్రస్తుత కుమురం భీం జిల్లా పాత బెజ్జూరు మండలం లోడ్‌పల్లిలో జరిగిన ఎన్‌కౌంటర్‌కు ప్రతీకారంగా దహెగాం మండలం బీబ్రా ఎస్సై లక్ష్మణరావును కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం క్వార్టర్‌లో ఉండగా ఉదయం ఏడు గంటలకు బయటకు పిలిచి కాల్చి చంపారు. 
  • 1989లో ప్రస్తుత పెంచికల్‌పేట మండలం చేడ్వాయి గుట్ట వద్ద ల్యాండ్‌మైన్‌ పేల్చి ఐదుగురు పోలీసులను హతమార్చారు. 
  • 1991లో నెల వ్యవధిలోనే రెండుసార్లు కౌటాల పోలీసు స్టేషన్‌పై దాడులు జరిగాయి. 
  • 1997లో ప్రస్తుత కుమురంభీం జిల్లా సిర్పూర్‌ (యూ) పోలీస్‌స్టేషన్‌ను బాంబులతో పేల్చివేయగా 11 మంది పోలీసులు మృతి చెందారు. వీరిలో ఇద్దరు సాధారణ వ్యక్తులున్నారు.
  • 1998లో కాగజ్‌నగర్‌ డీఎస్పీ కార్యాలయంపై దాడి చేయగా ముగ్గురు గన్‌మెన్లు మృత్యువాత పడ్డారు.
  • 1999 బెజ్జూరు ఫారెస్టు రేంజర్‌ కొండల్‌రావును పిస్తోల్‌తో కాల్చి చంపారు. గోలేటీ సీఐఎస్‌ఎఫ్‌ క్యాంపుపై దాడితోపాటు అనేక ప్రతీకార దాడులు జరిగాయి. 

కోల్‌బెల్టు ప్రాంతంలో ‘సికాస’
ఉమ్మడి జిల్లా పశ్చిమ ప్రాంత పరిధిలో అటవీ, గిరిజన ప్రాంతాల్లో పీపుల్స్‌ వార్‌ ఎన్‌కౌంటర్లు, ప్రతీకార దాడులు జరుగుతుండగా.. అదే సమయంలో తూర్పు ప్రాంతంగా ఉన్న ప్రస్తుత మంచిర్యాల జిల్లాలో పీపుల్స్‌వార్‌ గ్రూప్‌ అనుబంధ కార్మిక సంఘమైన సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) మిలిటెంట్‌ దళాల నియంత్రణకు పోలీసు బలగాలు అనేక ఎన్‌కౌంటర్లు జరిపాయి. 1996లో జిల్లా కార్యదర్శిగా ఉన్న మాదిరెడ్డి సమ్మిరెడ్డి అలియాస్‌ రమాకాంత్‌ ఎన్‌కౌంటర్‌ ‘సికాస’ చరిత్రలో ప్రముఖమైంది. మంచిర్యాల జిల్లా నస్పూర్‌ స్లాబ్‌క్వార్టర్ల ప్రాంతంలో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో సమ్మిరెడ్డితోపాటు అప్పటి చెన్నూరు సీఐ చక్రపాణి, కానిస్టేబుల్‌ అశోక్‌ మరణించారు.

ముఖ్యమైన ఎన్‌కౌంటర్లు చూస్తే 1991లో శ్రీరాంపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు, 1993లో రామక్రిష్ణాపూర్‌లో ఇద్దరు, 1996లో బెల్లంపల్లి మండలం చిన్నబుదలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు, 1998లో మాదారంలో, 1999లో నస్పూర్‌లో సికాస సభ్యులు ఎన్‌కౌంటర్‌లో మరణించారు. 2002లో బెల్లంపల్లిలోని గాంధీనగర్‌లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ముగ్గురు సికాస సభ్యులు మరణించారు.

అప్పటి ఆఫీసర్లే ఇప్పుడు సారథ్యం 
ఉమ్మడి జిల్లాలో అనేక ఎన్‌కౌంటర్లలో దూకుడుగా ఉన్న అప్పటి ఎస్సైలే ఇప్పుడు ఉన్నతస్థాయిలో ఉన్నారు. ఇటీవల జరిగిన బదిలీల్లో అప్పటి యువ అధికారులే ప్రస్తుతం కీలక ప్రాంతాల్లో ఉన్నతాధికారులుగా వచ్చారు. వారి ఆధ్వర్యంలోనే ‘మావోయిస్టు ఆపరేషన్‌’ కొనసాగుతోంది. 

భాస్కర్‌ వేటలో  భారీ కూంబింగ్‌
వేమనపల్లి: రెండు రోజులుగా తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దులో పోలీసులు కూంబింగ్‌ కొనసాగుతోంది. పొరుగున ఉన్న ఆసిఫాబాద్‌కొమురంభీం జిల్లా కదంబా ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెల్సిందే. అయితే కాల్పుల నుంచి తప్పించుకున్న రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్‌ భాస్కర్, మరో ఇద్దరు మావోయిస్టుల కోసం ప్రాణహిత తీరం వెంట డేగ కళ్లతో నిఘా ఏర్పాటు చేశారు.

కల్లెంపల్లి ఫెర్రీ పాయింట్‌ను పరిశీలిస్తున్న డీసీపీ, ఏసీపీ 
వేమనపల్లి మండలం కల్లెంపల్లి, ముక్కిడిగూడెం అడవులను పోలీసుబలగాలు జల్లెడ పడుతున్నాయి. పెద్దపల్లి డీసీపీ రవీందర్, జైపూర్‌ ఏసీపీ నరేందర్, రూరల్‌ సీఐ నాగరాజు సోమవారం కూంబింగ్‌ బలగాల వద్దకు వెళ్లి దిశానిర్దేశం చేశారు. కల్లెంపల్లి, ముక్కిడిగూడం గ్రామస్తులతో సమావేశమయ్యారు. కాలం చెల్లిన సిద్ధాంతాలతో జనం ముందుకు వస్తున్న మావోయిస్టులకు ఇప్పటికే ఎవరూ సహకరించడం లేదని, వారి మాటలు నమ్మవద్దని సూచించారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సహకరించొద్దని, కదలికలు ఉన్నట్లు గమనిస్తే 100కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇవ్వాలని అన్నారు. 

రాకపోకల నిలిపివేత
కదంబా ఎదురుకాల్పుల నేపథ్యంలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న ప్రాణహిత నదిపై రాకపోకలు నిలిపివేసినట్లు డీసీపీ, ఏసీపీ తెలిపారు. మండలంలోని ప్రాణహిత ఫెర్రీ పాయింట్లను సందర్శించారు. మావోయిస్టులు నది మీద రాకపోకలు సాగించే వీలున్నందున కోటపల్లి మండలం వెంచపల్లితోపాటు రాచర్ల, రేగుంట, వేమనపల్లి, కళ్లెంపల్లి ఫెర్రీ పాయింట్ల వద్ద తాత్కాలికంగా పడవలను నిలిపివేశామన్నారు. నది అవతలి వైపు ఉన్న సిరోంచ, బామిని, రేగుంట, వెంకటాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ల సహకారం తీసుకుని ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. ఆసిఫాబాద్‌ కొమురంభీం, మంచిర్యాల జిల్లాలోని తీరం వెంట ఉన్న పోలీస్‌స్టేషన్‌లను అప్రమత్తం చేశామని, 10 గ్రేహౌండ్స్‌ బృందాలకు చెందిన 400 మంది పోలీసులతో కూంబింగ్‌ కొనసాగుతోందన్నారు. తప్పిపోయిన మావోయిస్టులకు లొంగిపోవడమే శరణ్యమని, లేకుంటే ఏ క్షణంలోనైనా ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు.  

అర్ధరాత్రి బాదిరావు అంత్యక్రియలు
నేరడిగొండ: కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా కదంబా అడవుల్లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నేరడిగొండ మండలం అద్దాల తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన జుగ్నక్‌ బాదిరావు మృతిచెందిన విషయం విదితమే. ఆదివారం అర్ధరాత్రి ఆయన స్వగ్రామంలో అంత్యక్రియలు చేపట్టారు. నేరడిగొండ పోలీసులు మృతుడి తల్లితోపాటు సర్పంచ్‌ సీతారాం, పలువురు గ్రామస్తులను ఆదివారం ఉదయం ఆసిఫాబాద్‌ జిల్లాకు తీసుకెళ్లిన విషయం తెలిసిందే. అదే అర్ధరాత్రి మృతదేహాన్ని ఇచ్చోడ సీఐ కంప రవీందర్, నేరడిగొండ ఎస్సై భరత్‌సుమన్‌ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులు అద్దాల తిమ్మాపూర్‌కు తీసుకొచ్చారు. అనంతరం అంత్యక్రియలు చేపట్టారు.

రోధిస్తున్న మృతుని కుటుంబ సభ్యులు, బంధువులు 
దీంతో బంధువులు, ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు సోమవారం మృతుడి ఇంటికి చేరుకున్నారు. ఆయన తల్లి, కుటుంబ సభ్యులను పరామర్శించారు. జుగ్నక్‌ బాదిరావు కొంతకాలం నేరడిగొండలో లారీ క్లీనర్‌గా పనిచేశాడు. నాలుగైదు నెలల క్రితం నిర్మల్‌లో క్లీనర్‌గా పనిచేశాడు. ఇటీవల ఇంటికి వచ్చి వెళ్లినట్లు కుటుంబ సభ్యులు కంటతడి పెడుతూ తెలిపారు. నిర్మల్‌లోని లారీ యజమానిని అడగగా 20రోజులుగా పనికి రాలేదని తెలిపినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. చేతికొచ్చిన కొడుకు ఇలా ఎన్‌కౌంటర్‌లో మృతిచెందడంతో ఆ కుటుంబం రోధనలు మిన్నంటాయి.

మరిన్ని వార్తలు