చనిపోయింది కరోనాతోనే...

25 Jun, 2021 09:50 IST|Sakshi
హరిభూషణ్‌, సిద్ధబోయిన సారక్క ఆలియాస్‌ భారతక్క ( ఫైల్‌ ఫోటో )

హరిభూషణ్‌తోపాటు సారక్క కూడా...  

మావోయిస్టు రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్‌ వెల్లడి

దండకారణ్యంలోనే అంత్యక్రియలు.. సంస్మరణ సభ

కరోనాతో బాధపడుతున్న మరికొందరు మావోయిస్టులు

లొంగిపోతే చికిత్స చేయిస్తామంటూ పోలీసుల ప్రకటనలు

సాక్షి, హైదరాబాద్, వరంగల్‌: మావోయిస్టు పార్టీ నేతలపై కరోనా పంజా విసిరింది. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌తోపాటు మరో కీలక నేత, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్ద బోయిన సారక్క అలియాస్‌ భారతక్క కరోనా లక్షణాలతో మరణించారు. మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్‌  ఒక ప్రకటనలో ఈ వివ రాలు వెల్లడించారు. 21వ తేదీ ఉదయం హరి భూషణ్, 22న ఉదయం సారక్క చనిపోయారని.. వీరికి దండకారణ్యంలో ప్రజల సమక్షంలో అంత్య క్రియలు నిర్వహించామని తెలిపారు. ఈనెల 22న వారిద్దరి పేరిట సంస్మరణ సభ నిర్వహించామని, వారి కుటుంబాలకు మావోయిస్టు పార్టీ తరఫున సంతాపం తెలియజేశామని వెల్లడించారు. సుదీర్ఘ కాలంగా బ్రాంకైటిస్, ఆస్తమాతో బాధపడుతున్న హరిభూషణ్‌.. దండకారణ్యంలో ఉండటం, తగిన చికిత్స అందకపోవడంతో మరణించాడని పోలీసులు తెలిపారు.

సారక్క ప్రస్థానమిదీ..: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కాల్వపల్లిలోని ఓ ఆదివాసీ కుటుం బంలో సిద్దబోయిన సారక్క జన్మించింది. 1985లో ఏటూరునాగారంలో విప్లవమార్గం పట్టింది. 1986లో అరెస్టైనా జైలు నుంచి విడుదలయ్యాక తిరిగి పార్టీలో చురుకుగా మారింది. 2008లో పదోన్నతిపై దండకారణ్యానికి బదిలీ అయింది. ఎన్నో ఎన్‌కౌంటర్లలో త్రుటిలో తప్పించుకుంది. ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి ఏరియాలో జనతన సర్కార్‌ ఏర్పాటు చేసిన పాఠశాల బాధ్యతలు చూస్తోంది. ఆమె కుమారుడు అభిలాష్‌ కూడా మావోయిస్టు పార్టీలో చేరాడు. గత ఏడాది జూన్‌ లో మహారాష్ట్రలోని గడ్చిరోలిలో జరిగిన ఎన్‌ కౌంటర్‌లో ప్రాణాలు కోల్పోయాడు. సారక్కతో 29 సంవత్సరాలు కలిసి నడిచిన సహచరుడు కత్తి మోహన్‌ రావు ఈ నెల 10వ తేదీనే గుండెపోటుతో మరణించాడు. తర్వాత 12 రోజుల వ్యవధిలో సారక్క కరోనా లక్షణాలతో చనిపోయింది.

మిగతావారి పరిస్థితి ఏమిటి?
సాధారణ జనజీవనాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మారి అడవుల్లో ఉన్న మావోలపైనా ప్రతాపం చూపింది. వందల సంఖ్యలో మావో యిస్టులు కరోనా బారిన పడినట్టు సమాచారం. కాగా హరిభూషణ్‌తో కలిసి ఒకే ప్రాంతంలో ఉన్న ఆయన భార్య, శబరి–చర్ల ఏరియా కమిటీ సభ్యురాలు జజ్జర్ల సమ్మక్క అలియాస్‌ శారద ఏమైందని, ఆమె ఆరోగ్యం ఎలా ఉందోనని కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటీవల కరోనా బారినపడ్డ మావోయిస్టు నేత తిప్పిరి తిరుపతి అలియాస్‌ దేవ్‌జీ పరిస్థితి ఎలా ఉందోనని జగిత్యాల జిల్లా కోరుట్లలో ఆయన కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.


లొంగిపోతే చికిత్స చేయిస్తాం: భద్రాద్రి ఎస్పీ
మావోయిస్టు పార్టీ నేతలు, కార్యకర్తలు కరోనా బారినపడి మరణించడానికి మావో యిస్టు పార్టీ అగ్రనాయకులే కారణమని భద్రాద్రి ఎస్పీ సునీల్‌ దత్‌ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. మావోయిస్టుల్లో ఎవరికీ కరోనా సోకలేదని మొదట్లో ప్రకట నలు చేశారని.. చికిత్స కోసం బయటికి వెళ్ల కుండా అడ్డుకున్నారని పేర్కొన్నారు. కరోనా సోకిన మావోయిస్టులు తక్షణమే బయటికి రావాలని, వారికి అండగా ఉంటామని, చికిత్స చేయిస్తామని పిలుపునిచ్చారు. 

చదవండి : వైరల్‌: చెంప దెబ్బ కొట్టిన ఎస్పీ.. కాలితో తన్నిన సీఎం పీఎస్ఓ  

మరిన్ని వార్తలు