Maoist Party: హరిభూషణ్‌ స్థానంలో ఎవరు?

27 Jun, 2021 08:31 IST|Sakshi
లోకేటి చందర్‌

మావోయిస్టు రాష్ట్ర కార్యదర్శిగా లోకేటి చందర్‌ పేరు 

తెరపైకి దామోదర్, బండి ప్రకాశ్, సాంబయ్య పేర్లు కూడా.. 

పోలీసు ఇంటెలిజెన్స్, మాజీ మావోయిస్టుల వర్గాల్లో చర్చ 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌ స్థానంలో ఆ పార్టీ ఎవరిని నియమిస్తుందనే విషయం చర్చనీయాంశమైంది. విప్లవోద్యమంలో తుదకంటూ పోరాడిన హరిభూషణ్‌ ఈనెల 21న కరోనాతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దులో ఆ పార్టీ కార్యకలాపాలు ఉధృతంగా సాగుతున్న సమయంలో కేంద్ర కమిటీ నాయకుడు కత్తి మోహన్‌రావు అలియాస్‌ ప్రకాశ్‌ గుండెపోటుతో మరణించగా, హరిభూషణ్, మహిళా నాయకురాళ్లు సమ్మక్క అలియాస్‌ భారతక్క, శారద కరోనాకు బలయ్యారు. హరిభూషణ్‌ స్థానంలో ఎవరిని నియమిస్తారనేది పోలీసు ఇంటెలిజెన్స్, మాజీ మావోయిస్టు వర్గాల్లో చర్చనీయాంశమైంది.  

తెరపైకి లోకేటి చందర్‌ పేరు
హరిభూషణ్‌ స్థానంలో రాష్ట్ర కార్యదర్శిగా నిజామాబాద్‌ జిల్లాకు చెందిన లోకేటి చందర్‌ అలియాస్‌ స్వామిని నియమించవచ్చనే చర్చ జరుగుతోంది. నిజామాబాద్‌ జిల్లా కార్యదర్శిగా స్వామి చాలాకాలం పనిచేయగా, ఆయన సహచరి లోకేటి లక్ష్మి అలియాస్‌ సులోచన కూడా ఉద్యమంవైపే నడిచింది. మైదాన ప్రాంతాల నుంచి దళాలను ఎత్తివేసే సమయంలో దండకారణ్యానికి తరలివెళ్లినా.. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్‌ (కేఏఎన్‌) కమిటీకి కూడా స్వామి సారథ్యం వహించా డు. మూడు దశాబ్దాలుగా ఉద్యమంలో పనిచేస్తున్న స్వామి ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కీలక బాధ్యతల్లో ఉండగా, ఉద్యమ అవసరాల రీత్యా ఆయనకు అవకాశం కల్పించవచ్చంటున్నారు.

1991 నుంచి పార్టీలో కీలకంగా ఉన్న కొంకటి వెంకట్‌ అలియాస్‌ రమేష్‌ పేరు కూడా ప్రచారంలో ఉంది. కరీంనగర్‌ జిల్లా కమిటీ సభ్యుడిగా, ఆనుపురం కొంరయ్య అలియాస్‌ సుధాకర్‌ (ఏకే) ఎన్‌కౌంటర్‌ తర్వాత జిల్లా కార్యదర్శిగా కూడా పనిచేసిన ఆయన అప్పటి ఉత్తర తెలంగాణ స్పెషల్‌ జోన్‌ కమిటీలో సభ్యుడిగా వ్యవహరించాడు. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యంలో కీలకంగా ఉన్న రమేష్‌ పేరు కూడా వినిపిస్తుంది. అలాగే రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఉన్న బడే చొక్కారావు అలియాస్‌ దామోదర్, బండి ప్రకాశ్‌ పేర్లు కూడా రాష్ట్ర కార్యదర్శి కోసం పరిశీలించవచ్చంటున్నారు. 

కరోనా భయంతో మావోయిస్టు దంపతుల లొంగుబాటు
కొత్తగూడెం టౌన్‌: మావోయిస్టు పార్టీ మణుగూరు ఓఎల్‌ఎస్‌ సభ్యులుగా పనిచేస్తున్న ఇడుమ సురేందర్, సోనీ దంపతులు శనివారం భద్రాద్రి ఎస్పీ సునీల్‌దత్‌ ఎదుట లొంగిపోయారు. శనివారం కొత్తగూడెంలో ఎస్పీ సునీల్‌దత్‌ విలేకరుల సమావేశంలో ఈమేరకు వెల్లడించారు. అగ్ర నాయకత్వం వేధింపులకు పాల్పడటం, పార్టీలోని నాయకులకు, కార్యకర్తలకు కరోనా సోకుతుండడంతో భయాందోళనకు గురై వీరు బయటకు వచ్చినట్లు తెలిపారు. మడివి ఇడుమ అలియాస్‌ సురేందర్, మడకం బుద్రి అలియాస్‌ సోని ఐదేళ్లుగా మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్నారని, వీరు రాష్ట్ర కమిటీ సభ్యుడు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రీజనల్‌ కార్యదర్శి ఆజాద్‌కు గార్డుగా పనిచేశారని చెప్పారు.

మావోయిస్టులకు వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఎవరూ సహాయ సహకారాలు అందించవద్దని ఎస్పీ కోరారు. లొంగిపోయిన మావోయిస్టులకు అండగా ఉంటామని, మెరుగైన వైద్య చికిత్సతోపాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. లొంగిపోయిన మావోయిస్టులకు రివార్డులను అందజేశారు. కార్యక్రమంలో కొత్తగూడెం ఓఎస్డీ తిరుపతి, భద్రాచలం ఏఏస్పీ వినీత్, ప్రమోద్‌ పవార్, చర్ల సీఐ అశోక్‌ పాల్గొన్నారు. 
చదవండి: ముగిసిన 30 ఏళ్ల ప్రేమ ప్రయాణం 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు