గడ్డం మధుకర్‌ను పోలీసులే హత్య చేశారు: సమత

9 Jun, 2021 09:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్‌ జోన్‌ కమిటీ కార్యదర్శి గడ్డం మధుకర్‌ అలియాస్‌ శోభారాయ్‌ని పోలీసులు హత్య చేశారని మంగళవారం ఆ పార్టీ దక్షిణ జోనల్‌ బ్యూరో అధికార ప్రతినిధి సమత ఆరోపించారు. అనారోగ్యం కారణంగా చికిత్స కోసం వెళ్లిన శోభారాయ్‌ని జూన్‌ 1న స్పెషల్‌ బ్రాంచి పోలీసులు అరెస్టు చేశారని, ఈ విషయాన్ని పోలీసులే ప్రకటించారని పేర్కొన్నారు. ఆసుపత్రిలో మెరుగైన చికిత్స అందిస్తామని చెప్పి, ఆఖరికి 6వ తేదీన మరణించారని మీడియాకు ప్రకటన ఇచ్చారని ఆరోపించారు.

వాస్తవానికి మధుకర్‌ను జూన్‌ 1 నుంచి 5వ తేదీ వరకు చికిత్స అందించకుండా తీవ్రంగా హింసించారని ఆరోపించారు. 15 రోజుల కింద పీఎల్‌జీఏ ప్లటూన్‌ కమాండర్‌ గంగాల్‌ను కూడా ఇదే తరహాలో హత్య చేశారని తెలిపారు. పోలీసు అధికారులు తమ చేతికి చిక్కినవారిని హత్య చేస్తూనే కరోనాను సాకుగా చూపుతూ సరెండర్‌ కావాలని, సరెండర్‌ అయిన వారికి మెరుగైన వైద్య సౌకర్యం అందిస్తామని ప్రలోభపెడుతున్నారని విమర్శించారు. ప్రభుత్వాల అబద్ధపు ప్రచారాన్ని ఏ మాత్రం నమ్మవద్దని సూచించారు.

హాని తలపెట్టం, చికిత్స అందిస్తాం
ప్రస్తుతం మావోయిస్టు దళాల్లో వైరస్‌ తీవ్రత అధికంగా ఉంది. వారి కోసం తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌లో మందులను సేకరిస్తున్నట్లు మాకు సమాచారం ఉంది. ఇప్పుడు లాక్‌డౌన్‌ వల్ల ఆ ప్రయత్నాలకు బ్రేక్‌ పడింది. కరోనా పాజిటివ్‌ ఉన్న సభ్యులెవరైనా లొంగిపోవాలని కోరుతున్నాం. వారికి ఎలాంటి హానీ తలపెట్టం. కావాల్సిన చికిత్స అందజేస్తాం. – అభిషేక్, దంతెవాడ ఎస్పీ
చదవండి: కరోనా చికిత్స కోసం వచ్చి.. పోలీసులకు చిక్కాడు!

మరిన్ని వార్తలు