ఎవరీ మడవి హిడ్మా?

6 Apr, 2021 03:05 IST|Sakshi

ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల విధ్వంస ఘటనల సూత్రధారి 

స్వగ్రామం సుక్మా జిల్లా పువ్వర్తి ఆదివాసీ గ్రామం 

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం/చర్ల: మావోయిస్టు అగ్రనేత మడావి హిడ్మా.. భారీ సంఖ్యలో పోలీసు బలగాలు వెళ్లింది ఆయనను పట్టుకునేందుకే.. కానీ పక్కాగా ప్లాన్‌ చేసి ఇంతమంది పోలీసులను రప్పించి, దాడి చేసిందీ ఆయనే.. ఇంతకుముందు జరిగిన భారీ ఎన్‌కౌంటర్లు, దాడుల ఘటనల్లో కీలకమూ ఆయనే.. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన తాజా ఘటనతో ఎక్కడ చూసినా హిడ్మా పేరే వినిపిస్తోంది. మరి ఇంతకీ ఎవరీ హిడ్మా? ఎక్కడివాడు, ఏం చేశాడనేది చర్చనీయాంశంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా జేగురుగొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పువ్వర్తికి చెందిన ఆదివాసీ మడావి హిడ్మా. ఆయన తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉంటున్నారు.

5 వరకే చదువుకున్న హిడ్మా.. 25 ఏళ్ల వయసులోనే మావోయిస్టు పార్టీలో చేరాడు. ప్రస్తుతం ఆయన వయసు 40 ఏళ్లు. మావోయిస్టు పార్టీ పీపుల్స్‌ లిబరేషన్‌ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ)–1వ బెటాలియన్‌కు కమాండర్‌గా.. దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీలో సభ్యుడిగా పనిచేస్తున్నాడు. మావోయిస్టుల టాక్టికల్‌ కౌంటర్‌ అఫెన్సివ్‌ క్యాంపెయిన్‌ కూడా హిడ్మా నేతృత్వంలోనే దాడులు చేస్తుంది.

హిడ్మా భార్య కూడా మావోయిస్టు పారీ్టలోనే పనిచేస్తోంది. పీఎల్‌జీఏ సభ్యులకు శిక్షణ ఇచ్చేది హిడ్మానే. ఒక్కో బెటాలియన్‌ 200 మంది మావోయిస్టులుంటారు. కొత్తగా ఏ బెటాలియన్‌ పెట్టినా హిడ్మా ఆధ్వర్యంలోనే పూర్తి స్థాయి ట్రైనింగ్‌  ఉంటుంది. పీఎల్‌జీఏతోపాటు మిలీíÙయా సభ్యులకు కూడా ఫైరింగ్‌లో శిక్షణ ఇస్తాడు. ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన 25కుపైగా ఘటనలకు హిడ్మానే సూత్రధారి అని చెబుతారు. 

రామన్న తర్వాత హిడ్మా..  
ఛత్తీస్‌గఢ్‌లో గెరిల్లా దాడుల బాధ్యతలను ఇంతకుముందు మవోయిస్టు నేత రామన్న చూసేవారు. ఆ తర్వాత హిడ్మా ఆ బాధ్యతలు చేపట్టాడు. కూంబింగ్‌ ఆపరేషన్లు చేసే పోలీస్‌ బలగాలపై, సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులపై మెరుపు వేగంతో దాడులు నిర్వహించడంలో కీలకంగా వ్యవహరిస్తుంటాడు. మావోయిస్టు పార్టీలో పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) విభాగం హిడ్మా కనుసన్నల్లోనే పనిచేస్తుంది. దండకారణ్యంపై ఆయనకు పూర్తి పట్టు ఉంది. హిడ్మా తలపై రూ.40లక్షల రివార్డు కూడా ఉంది. గతంలో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవి హత్య కేసులో హిడ్మాపై ఎన్‌ఐఏ చార్జీషీట్‌ కూడా వేసింది. హిడ్మా నేతృత్వంలో జరిగిన కొన్ని ఘటనలు ఇవీ.. 

  • 2010 ఏప్రిల్‌ 6న సుక్మా జిల్లా తాడిమెట్ల అటవీ ప్రాంతంలో మైన్‌ ప్రొటెక్షన్‌ వాహనాన్ని మందుపాతరలతో పేల్చివేసి, కాల్పులు జరిపిన ఘటన హిడ్మా ఆధ్వర్యంలోనే జరిగింది. ఇందులో 74 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు, ఒక సాధారణ పౌరుడు మృతి చెందాడు. 
  • 2017 మార్చి 12న సుక్మా జిల్లా బెజ్జి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కొత్తచెరువు దగ్గర రోడ్డు నిర్మా ణ పనులకు భద్రతగా వెళ్తున్న జవాన్లపై మందుపాతరతో దాడి జరిగింది. ఆ ఘటనలో 12మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లుమృతి చెందారు. 
  • 2017 ఏప్రిల్‌ 24న ఇదే జిల్లా చింతగుఫా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బుర్కాపాల్‌ సమీపంలో రోడ్డు పనులకు భద్రతగా వెళ్తున్న సీఆర్‌పీఎఫ్‌ జవాన్లను చుట్టుముట్టి చేసిన దాడిలో.. 24 మంది జవాన్లు చనిపోయారు.
  • 2018 మార్చి 13న సుక్మా జిల్లా కాసారం అటవీ ప్రాంతంలో మావోయిస్టులు మందుపాతర పేల్చడంతో 12 మంది జవాన్లు మృతి చెందారు. 
  • 2020 ఫిబ్రవరిలో ఇదే జిల్లా పిడిమెట అటవీ ప్రాంతంలో మందుపాతర పేల్చి, కాల్పులు జరపడంతో 12 మంది డీఆర్‌జీ జవాన్లు మృతి చెందారు. తాజాగా శనివారం జొన్నగూడెం దాడిలో 22 మంది జవాన్లు మృతి చెందారు.  

మరిన్ని వార్తలు