సంస్మరణంపై ‘డ్రోన్‌’ నిఘా 

29 Jul, 2021 01:53 IST|Sakshi

కరోనా, కోవర్టుల నడుమ మావోయిస్టుల సంస్మరణ వారోత్సవాలు 

మూడు రాష్ట్రాల సరిహద్దులో అప్రమత్తమైన బలగాలు 

సాక్షి ప్రతినిధి, వరంగల్‌: తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల సరిహద్దులో పారా మిలటరీ, పోలీసు బలగాలు మళ్లీ అప్రమత్తమయ్యాయి. కరోనా, కోవర్టుల కారణంగా ఇటీవల మావోయిస్టు పార్టీ పలువురు ఉద్యమకారులను కోల్పోయింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 3 వరకు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించుకుందామని ఆ పార్టీ ప్రజలకు పిలుపునిచ్చింది. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో గతంలో ఏటా రెడీమేడ్‌ స్థూపాలు ఏర్పాటు చేసి వారోత్సవాలు ఘనంగా నిర్వహించేవారు.

మావోయిస్టులు క్రమంగా ఈ ప్రాంతాల్లో పట్టు కోల్పోవడంతో కొన్నేళ్లుగా మైదాన ప్రాంతాల్లో నిర్వహించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు, తర్వాత కూడా నక్సల్స్‌పై ప్రభుత్వాల వైఖరి మారలేదు. ఓ వైపు పోలీస్‌ ఎన్‌కౌంటర్లు, మరోవైపు కరోనా మావోయిస్టు పార్టీ కీలక నేతలపై తీవ్ర ప్రభావం చూపింది. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆగస్టు 3 వరకు మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు తప్పకుండా నిర్వహించాలని పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధికార ప్రతినిధి జగన్‌ పిలుపునిచ్చారు. ఘనంగా నిర్వహించేందుకు మావోయిస్టులు ప్రయత్నాలు చేస్తుండగా, అడ్డుకునేందుకు పోలీసులు కూంబింగ్‌ నిర్వహిస్తుండటంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.  

డేగ కన్ను, ‘డ్రోన్‌’నిఘా... 
మూడు రాష్ట్రాల్లో సాయుధ పోలీసు బలగాలు మావోయిస్టు వారోత్సవాలపై డేగకన్ను వేశాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, గోదావరి తీరం వెంట పోలీసు క్యాంపులు ఏర్పాటు చేశారు. తూర్పు డివిజన్‌ సరిహద్దుల్లో పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో పోలీస్‌ యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తమైంది. మహాముత్తారం, మహదేవపూర్, ఏటూరునాగారం అటవీ ప్రాంతాలపై పోలీసులు ప్రధానంగా దృష్టి సారించినట్లు సమాచారం. అటవీ ప్రాంతాల్లో పోలీస్‌ బలగాలు నిరం తరం కూంబింగ్‌ నిర్వహిస్తున్నా యి. ఇటీవల ములుగు–భూపాలపల్లి–పెద్దపల్లి జిల్లాల మావోయిస్టు పార్టీ క మిటీ కార్యదర్శి కంక నాల రాజిరెడ్డి అలియాస్‌ వెంకటేష్‌ పేరిట పలు ప్రజా సమస్యల విషయమై అధికార పార్టీ నేతలపై హెచ్చరి కలు జారీ చేయడంతో పోలీస్‌లు అప్రమత్తమ య్యారు. గిరిజన గ్రామాలపై ‘డ్రోన్‌’నిఘా కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు