సరిహద్దుల్లో భయం భయం  

27 Sep, 2020 03:58 IST|Sakshi

బీజాపూర్‌ జిల్లాలో పలువురిని కిడ్నాప్‌ చేసిన మావోలు 

వారం రోజుల వ్యవధిలో 16 మంది హత్య

చర్ల: ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలోని ఆదివాసీ పల్లెల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ల నేపథ్యంలో తెలంగాణతో పాటు ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యంలోనూ పోలీసులు ముమ్మరంగా కూంబింగ్‌ చేస్తున్నారు. అయితే పోలీసులకు కొరియర్లుగా వ్యవహరిస్తున్నారని, తమ సమాచారం పోలీసులకు చేరవేస్తున్నారనే ఆరోపణలతో ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలోని బీజాపూర్‌ జిల్లాలో పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను మావోయిస్టులు కిడ్నాప్‌ చేసి, ప్రజాకోర్టులు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురిని హతమారుస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా బీజాపూర్‌ జిల్లాలోని పామేడు పోలీస్‌స్టేషన్‌ పరిధిలో గల పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలను వారం వ్యవధిలో 16 మందిని హతమార్చినట్లు సమాచారం.

మావోయిస్టుల చేతిలో మృతి చెందిన వారిలో బట్టిగూడెం, కౌరగట్ట, కోడేపాల్, బీమారంపాడు, పూసుబాక గ్రామాలకు చెందిన వారు ఉన్నట్లు తెలిసింది. కాగా ఇన్‌ఫార్మర్ల హత్యల విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తెలియనీయవద్దని, ఎవరైనా చెబితే వారిని కూడా శిక్షిస్తామని మావోయిస్టులు హెచ్చరించినట్లు సమాచారం. ఆయా గ్రామాల నుంచి పామేడుకు వచ్చి పోలీసులకు సమాచారం ఇస్తారనే అనుమానంతో పామేడు – ధర్మారం మధ్యలో ఉన్న వాగులపై నడిచే పడవలను సైతం మావోయిస్టులు నిలిపివేసినట్లు తెలిసింది. అలాగే ఆదివాసీల వద్ద ఉన్న మొబైల్‌ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో ఆయా గ్రామాలకు చెందిన ఆదివాసీలు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎంత మందిని హతమారుస్తారోనని భయపడుతున్నారు.   

28న బంద్‌కు మావోయిస్టుల పిలుపు
వివిధ ప్రాంతాల్లో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లకు నిరసనగా ఈనెల 28న రాష్ట్రవ్యాప్త బంద్‌ పాటించాలని జయశంకర్‌ భూపాలపల్లి – ములుగు – మహదేవపూర్‌ – వరంగల్‌ – పెద్దపల్లి డివిజన్ల సీపీఐ (మావోయిస్టు) కార్యదర్శి వెంకటేశ్‌ పేరిట శనివారం ఓ ప్రకటన విడుదలైంది. చెన్నాపురం, కదంబ పూసుగుప్ప, దేవార్లగూడెంలలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్లను ఖండించాలని పేర్కొన్నారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లలో శంకర్, శ్రీను, ఐతు, చుక్కాలు, బాజీరావు, జోగయ్య, రాజే, లలితను ముందస్తుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు బూటకపు ఎన్‌కౌంటర్లకు పాల్పడి హత్య చేశారని ఆరోపించారు. ఈ బూటకపు ఎన్‌కౌంటర్లపై హక్కుల సంఘాలు నిజనిర్ధారణ కొనసాగించి బాధ్యులైన వాళ్లకు శిక్షలు పడేలా చూడాలని ఆయన కోరారు. 

మరిన్ని వార్తలు